Rolls Royce Phantom Price: చిరంజీవి ఖాతాలో మరో రోల్స్ రాయిస్.. ధర ఎన్ని కోట్లో తెలుసా?
కృషి, పట్టుదల, ప్రతిభ వంటి ఎంతటి సామాన్యుడైనా .. అసాధారణ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించారు చిరంజీవి. ఓ మారుమూల గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కొణిదెల శివ శంకర వరప్రసాద్ ఈ స్థాయికి వస్తానని? సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతానని? బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు. కానీ తన కష్టంతో భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు చిరు. మూసలో సాగిపోతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు దూకుడు నేర్పించిన ఆయన టాలీవుడ్ మార్కెట్‌ను, స్థాయిని పెంచారు . 70 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా కష్టపడుతూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
47 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 150కి సినిమాల్లో నటించడంతో పాటు పద్మభూషణ్, పద్మవిభూషణ్, డాక్టర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సహా ఎన్నో జాతీయ , అంతర్జాతీయ అవార్డులను చిరంజీవి అందుకున్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులకు ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను స్థాపించి వేలాది ప్రాణాలు కాపాడారు. కరోనా సమయంలో తన సొంత డబ్బుతో ఆక్సిజన్ ప్లాంట్లు, మందులు ఇతర పరికరాలను ఆపదలో ఉన్న వారికి పంపించారు.

ఎంత ఒదిగినా ఒదిగే తత్వం, ఇప్పటికీ నిత్య విద్యార్ధిలా నేర్చుకునే అలవాటు చిరంజీవిని ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్‌లో చిరంజీవి బిజీగా ఉన్నారు. ఇందులో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
చిరంజీవికి చిన్నప్పటి నుంచి కార్లంటే మహా పిచ్చి. హీరోగా నిలదొక్కుకుంటున్న నాటి నుంచి నేటి వరకు ఎన్నో లగ్జరీ కార్లను ఆయన కొనుగోలు చేసి ముచ్చట తీర్చుకున్నారు. సినిమాలు, వ్యక్తిత్వమే కాదు .. వాడే కార్ల విషయంలోనూ చిరంజీవి తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. మార్కెట్‌లోకి ఎప్పుడు ఏ కార్ వచ్చినా దానిని తక్షణం కొనాల్సిందే. అలా ఆయన క్యారేజీలో అత్యంత ఖరీదైన కార్లు కొలువుదీరాయి. అన్నింటిలోకి చిరంజీవి వాడే రోల్స్ రాయిస్ ప్రత్యేకమైనది.
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న రోల్స్ రాయిస్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టం. తాజాగా ఆయన కుమారుడు , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి పుట్టినరోజు కానుకగా రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ను బహుకరించారు. దీని ద్వారా రూ. 8.99 కోట్ల నుంచి రూ.11 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇవే కాదు.. చిరంజీవి కారు కలెక్షన్స్‌లో ఇంకా బోల్డెన్నీ ఉన్నాయి. రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్లు ఉన్నాయి. వీటి ధర రూ. 2 కోట్ల పై మాటే. అలాగే రేంజ్ రోవర్ వోగ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, టయోటా వెల్ ఫైర్ తదితర లగ్జరీ కార్లు ఉన్నాయి. చరణ్ ఇచ్చిన రోల్స్ రాయిస్ కారులో హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న చిరంజీవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











