‘అందమైన హీరోయిన్లతో రొమాన్స్ చేసినా.. నా భార్యకు ద్రోహం చేయలేదు’
సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కలకలం రేపుతుంటాయి. ఇందులో కొన్ని నిజాలుంటే చాలావరకు ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా నటీనటులు తెరపై రొమాన్స్ చేసే అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉన్నవి లేనివి కల్పించి, రకరకాల పుకార్లను వ్యాప్తి చేయడానికి కొందరు రెడీగా ఉంటాయి. అయితే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని రూమర్స్ వచ్చిన నటీనటుల జీవిత భాగస్వాములు వారికి అండగా నిలబడుతుంటారు. తాజాగా కోలీవుడ్ నటుడు మాధవన్ తన సినీ జీవితం, తన భార్యతో బంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జంషెడ్‌పూర్‌లోని తమిళ కుటుంబంలో జన్మించారు మాధవన్. ఆయన పూర్తి పేరు రంగనాథన్ మాధవన్. ఆయన తండ్రి టాటా స్టీల్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు, తల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. 1996లో ఈజ్ రాత్ కి సుభా నహి అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర ద్వారా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన మాధవన్‌కు మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో వచ్చిన అలయ్ పయుతే అనే సినిమాతో స్టార్‌డమ్ అందుకున్నారు. అనంతరం రన్, అన్బే శివమ్, గురు, రంగ్ దే బసంతి, 3 ఇడియట్స్, తను వెడ్స్ మను, వెట్టై, ఇరుది సుట్రు, విక్రమ్ వేద తదితర సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవల తన ఫోకస్ పూర్తిగా హిందీ చిత్రాలపైనే పెట్టారు మాధవన్. కేసరి చాప్టర్ 2, సైతాన్, టెస్ట్, మా, దే దే ప్యార్ దే 2లతో ఇక ధురంధర్‌లో ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్‌గా ఆయన భారత్‌తో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం జీడీ నాయుడు బయోపిక్‌తో పాటు అదృష్టశాలి, సర్కిల్ సినిమాలలో నటిస్తున్నారు. 30 ఏళ్లుగా సినీరంగానికి అందించిన సేవలకు గాను మాధవన్‌ను భారత ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
ఇక 90వ దశకంలో సఖి, చెలి తదితర సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు మాధవన్. అమ్మాయిల కలల రాకుమారుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయనను సరిత బిర్జే అనే అమ్మాయి దెబ్బకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొల్హాపూర్‌లో మాధవన్ నిర్వహిస్తున్న పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులకు హాజరైన సరితకు ఆయన చెప్పిన విషయాలు కెరీర్‌కు బాగా ఉపయోగపడ్డాయి. ఓ విమానయాన సంస్థలో ఉద్యోగం రావడంతో మాధవన్‌ను డిన్నర్‌కు పిలిచి థ్యాంక్స్ చెప్పారు సరిత. అలా వీరి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు 8 ఏళ్లపాటు వీరి ప్రేమాయణం సాగగా.. 1999లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధం ద్వారా వీరిద్దరూ ఒక్కటయ్యారు. 2005లో ఈ దంపతులకు వేదాంత్ అనే కుమారుడు జన్మించాడు. ఈ అబ్బాయి తండ్రి బాటలో సినీరంగం వైపు కాకుండా ఇంటర్నేషన్ స్విమ్మర్‌గా రాణిస్తూ భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
భార్యను ముద్దుగా హనీ అని పిలుచుకునే మాధవన్.. సరితను తన అదృష్ట దేవతగా భావిస్తారు. తను వచ్చాకే కెరీర్‌లో సక్సెస్ అయ్యానని పలుమార్లు తెలిపారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. నాకు స్టార్‌డమ్ వచ్చాక ఎంతోమంది అమ్మాయిలు ఇష్టపడేవారు. సహజంగానే తన భర్తను మరో అమ్మాయి ప్రేమిస్తోందంటే ఏ భార్య తట్టుకోలేదు. ఒకరకమైన అభద్రతా భావానికి గురవుతారు. సరితలో అలాంటి భావన రాకుండా ఎప్పటికీ నేను నీ వాడినే అన్న నమ్మకం కలిగించా. ఎప్పటికీ నా భార్యకు ద్రోహం చేయను, అందమైన హీరోయిన్స్‌తో కలిసి నటించే సమయంలోనూ ఈ విషయాన్ని గుర్తుంచుకుంటా. దీనికి పెద్దగా కారణాలంటూ లేవు.. నేను సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. నా భార్యని మోసం చేసి ఆ తర్వాత చోటు చేసుకునే పర్యవసనాలను ఎదుర్కోవడానికి నేను సిద్దంగా లేను. దేవుడు నాకు ప్రసాదించిన ఒక మంచి భార్య చాలు అని మాధవన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో వైరల్ అవుతుండగా.. మాధవన్- సరితల బంధంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications


