క్రికెటర్ బూమ్రాకు రాంచరణ్ బహిరంగ క్షమాపణ.. పెద్ది ఈవెంట్‌లో దొర్లిన తప్పుకు సారీ
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు.
పెద్ది సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెద్ది కి ఆవాజ్ పేరుతో మ్యూజికల్ నైట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌లో మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమం అశేష అభిమానుల మధ్య కన్నుల పండువగా సాగింది. అయితే వేదికపై దొర్లిన తప్పుకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ మనస్పూర్తిగా క్షమాపణలు సోషల్ మీడియా ద్వారా చెప్పారు. రాంచరణ్ నోటి నుంచి దొర్లిన తప్పు ఏమిటంటే?

భోపాల్‌లో భారీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులతో రాంచరణ్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. కాసేపు భావోద్వేగానికి లోనయ్యారు. క్రీడా రంగంలో రాణించాలనుకొనే బాలలకు స్పూర్తిగా ఈ సినిమా నిలుస్తుంది. తన కెరీర్‌లో ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో పెద్ది చిత్రం తన లైబ్రరీలో ముందు వరుసలో నిలుస్తుంది అని చెప్పారు. అయితే తన స్పీచ్ ముగిసిన తర్వాత యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. క్రికెట్ నేపథ్యంగా సాగే స్పోర్ట్స్ డ్రామా కావడంతో భారత క్రికెటర్ల గురించి రాంచరణ్ తన అభిప్రాయాలను తెలిపారు.
సచిన్ టెండూల్కర్ గురించి అడిగితే.. లాంగ్ లెజెండరీ హిస్టరీ ఉన్న క్రికెటర్ అని సమాధానం చెప్పాడు. ఎంఎస్ ధోని గురించి ఒక్క మాటలో చెప్పమని అడిగితే.. కామ్, కూల్ అని అన్నాడు. రోహిత్ శర్మ గురించి అడిగితే.. అందరూ ఇష్టపడే క్రికెటర్ అని చెప్పాడు. విరాట్ కోహ్లీ.. ఫైర్ ఉన్న క్రికెటర్ అని చెప్పాడు. జస్ప్రిత్ బూమ్రా గురించి అడిగితే.. నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్. ఐ లవ్ ఫుట్‌బాల్, ఫుట్ బాల్ క్రీడను ముందుకు తీసుకెళ్తున్న తీరు చూస్తే ముచ్చటేస్తుంది. మీరంటే గౌరవం పెరిగింది అని అన్నాడు.
అయితే క్రికెటర్ అయిన బూమ్రా గురించి తప్పుగా సమాచారం ఇవ్వడంతో ఆ తర్వాత రియలైజ్ అయిన రాంచరణ్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే.. సాధారణంగా నేను కొందరి పేర్లు మరిచిపోతుంటాను. జస్ప్రీత్ బూమ్రా గురించి నా నోటి నుంచి తప్పు దొర్లింది. అందుకు మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పుకొంటున్నాను. భారీగా తరలి వచ్చిన అభిమానులను చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ సందర్బంగా జరిగిన మానవ తప్పిదం మాత్రమే. మీరంటే నాకు అమితమైన గౌరవం ఉంది. మీరు ఆడే క్రీడకు పెద్ద ఫ్యాన్‌ను. బ్యాట్స్‌మెన్ల వెనకడుగు వేసేలా మీరు సంధించే బంతులను చూసి భారతీయులంతా గర్వపడుతారు. ప్రతీ భారతీయుడిని గర్వంగా ఫీలయ్యేలా చేస్తారు అని తన ట్వీట్‌లో రాంచరణ్ ప్రశంసలు గుప్పించారు.


Click it and Unblock the Notifications