రికార్డు క్రియేట్ చేసిన రామ్ చరణ్ వీడియో: టాలీవుడ్‌లో రెండో టీజర్‌గా ఘనత
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా ఎదిగిన అతడు.. వరుస పెట్టి సినిమాలను చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రంలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగానూ, తారక్.. కొమరం భీంగానూ నటిస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి 'భీమ్ ఫర్ రామరాజు' పేరిట రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన పరిచయ వీడియో విడుదలైన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదలైన ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన కూడా వచ్చింది. తెలుగులో ఇప్పటి వరకూ 38 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా 'భీమ్ ఫర్ రామరాజు' టీజర్ ఒక మిలియన్ కామెంట్లను అందుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

అయితే, ఇదే సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో అయిన 'రామరాజు ఫర్ భీం' ఒక మిలియన్ కామెంట్లను అందుకుంది. ఆలస్యంగా వచ్చినా.. ఈ టీజర్ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ వచ్చింది. వ్యూస్ పరంగానూ సత్తా చాటింది. ఇప్పుడు రామ్ చరణ్ టీజర్.. దీని తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక, ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, అజయ్ దేవగణ్, సముద్రఖని, రాహుల్ రవీంద్ర, అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











