ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన రామ్ చరణ్... 5 గంటల్లోనే సంచలనం!
ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలను వెనక్కి నెట్టి ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తుతం ట్రెండింగులో ఉంది. దీంతో సినీస్టార్లంతా ఇందులో ఖాతాలు తెరవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఇందులోకి ఎంటర్ అవ్వగా... తాజాగా ఈ లిస్టులో రామ్ చరణ్ చేరారు.
రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ 'రంగస్థలం'లో గడ్డం లుక్‌తో ఉన్న ఫోటోను ఈ సందర్భంగా చరణ్ పోస్ట్ చేశాడు. @alwaysramcharan పేరుతో ఈ ఖాతా ఉంది. అకౌంట్ ఓపెన్ చేసిన 5 గంటల్లోనే 50వేల మందికిపైగా ఆయన్ను ఫాలో అవ్వడం విశేషం. ఈ స్పీడు చూస్తుంటే ఒకటి రెండు రోజుల్లోనే 1 మిలియన్ రీచ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
చరణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలియగానే అభిమానుల మాదిరిగానే అక్కినేని హీరో అఖిల్ కూడా సర్‌ప్రైజ్ అయ్యాడు. 'వెల్‌కం టు ఇన్‌స్టాగ్రామ్ ఆర్‌సి... ఇదొక ప్లజంట్ సర్‌ప్రైజ్' అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు.

ఇప్పటి వరకు రామ్ చరణ్ కేవలం ఫేస్‌బుక్ అధికారిక ఖాతా మాత్రమే మెయింటేన్ చేస్తూ వచ్చాడు. గతంలో ట్విట్టర్ ఖాతా కూడా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ఖాతాను క్లోజ్ చేశాడు. చాలా రోజుల తర్వాత చరణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖాతా ద్వారా చరణ్ తన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు అభిమానులతో పంచుకోనున్నారు.
సినిమాల విషయానికొస్తే... రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 2020లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు చరణ్ నిర్మాతగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











