కొత్త సినిమాపై రామ్ ఆసక్తికర ట్వీట్: అంటే కథ వినకుండానే ప్రారంభించేశాడా!
ప్రముఖ నిర్మాత కుటుంబం నుంచి హీరోగా పరిచయం అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అతడు.. మధ్యలో కొన్ని పరాజయాలను చవి చూశాడు. అయితే, ఈ మధ్య కాలంలో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామితో కలిసి ఓ ద్విభాషా చిత్రాన్ని చేయబోతున్నాడు. తాజాగా ఈ మూవీ గురించి అతడు ట్వీట్ చేశాడు.
తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన లింగుసామితో ఉస్తాద్ రామ్ పోతినేని సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. అలాగే, ఈ సినిమా జూలై నుంచి పట్టాలెక్కబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హీరో రామ్ ట్విట్టర్‌లో 'ఫైనల్ నేరేషన్ అయిపోయింది. లవ్ యూ లింగుసామి సార్. ఫుల్ కిక్కుతో సినిమాను మొదలు పెడుదాం' అని పేర్కొన్నాడు. దీంతో సినిమాను త్వరలోనే మొదలెట్టబోతున్నట్లు వెల్లడించాడు. ఇదిలా ఉండగా.. ఈ ట్వీట్ చూసిన తర్వాత రామ్ పూర్తి కథ వినకుండానే సినిమాను ఓకే చేశాడా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోతుంది. ఇందులో రామ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడని అంటున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక, ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











