Ranbir Kapoor పాకిస్థాన్ చిత్రాల్లో నటిస్తా.. రణ్‌బీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు
బ్రహ్మస్త్ర సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న రణ్‌బీర్ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకలో వెరైటీ ఇంటర్నేషనల్ వాన్‌గార్డ్ యాక్టర్ అవార్డును రణ్‌బీర్ సొంతం చేసుకొన్నాడు. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ..
రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రేక్షకులు, మీడియాతో నిర్వహించిన సమావేశంలో రణ్‌బీర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన సినిమా ప్రముఖుడు ఓ ప్రశ్న వేస్తూ.. ఇతర భాషల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం పాకిస్థాన్ నటులపై ఇండియాలో నిషేధం ఉంది. అలాగే భారతీయ నటీనటులుపై పాకిస్థాన్‌లో బ్యాన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా, పాకిస్థాన్, ఇతర దేశాలకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్‌లో నటిస్తారా అని అడిగారు.

ఫిల్మ్ మేకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నటీనటులకు సరిహద్దులు లేవు. అవసరమైతే పాకిస్థానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయడానికి సిద్దంగా ఉన్నాను అని రణ్‌బీర్ కపూర్ అన్నారు. ఇక బాలీవుడ్‌లో నటించిన ఫవద్ ఖాన్, మిహిరా ఖాన్ నటించిన ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ చిత్రం పాకిస్థాన్‌లో రిలీజైంది. పుల్వామా దాడి ఘటన తర్వాత పలువురు పాకిస్థాన్ నటీనటులపై ది ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ బ్యాన్ విధించింది. అప్పటి నుంచి పాకిస్థాన్ నటీనటులు బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ కపూర్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి.
రణ్‌బీర్ కపూర్ కెరీర్, వ్యక్తిగత విషయానికి వస్తే.. గతేడాది ఆలియాభట్‌ను వివాహం చేసుకొన్న ఆయన ఇటీవలే ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. ఇటీవల విడుదలైన బ్రహ్మస్త్ర చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











