ధురంధర్ తర్వాత రణ్‌వీర్ సింగ్ నికర ఆస్తులు ఎంత? రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?
ధురంధర్ 2.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. నార్త్, సౌత్.. ఇండియా.. ఓవర్సీస్ అన్న తేడాలు లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు థియేటర్లకు పోటెత్తడంతో ప్రతి ఊరిలో థియేటర్లు చాలారోజుల తర్వాత కళకళలాడుతున్నాయి. కేవలం 3 రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 1000 కోట్ల వైపు అడుగులు వేస్తోంది ధురంధర్ 2. దీని ఊపు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఆదిత్యధర్ దర్శకత్వం, రణ్‌వీర్ సింగ్ నటన గురించి ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీర్ రణ్‌వీర్ సింగ్ సినిమాలు, ఆయన పారితోషికం, ఆస్తులు గురించి పరిశీలిస్తే..
కాపీరైటర్‌గా కెరీర్ ప్రారంభం
6 జూలై 1985న ముంబైలో జన్మించారు రణ్‌వీర్. ఆయన పూర్తి పేరు రణ్‌వీర్ సింగ్ భవ్నానీ. తల్లిదండ్రులు అంజు, జగ్జిత్ సింగ్ భవ్నానీ. వీరి పూర్వీకులు అవిభక్త భారతదేశంలో కరాచీకి చెందినవారు. దేశ విభజన సమయంలో రణ్‌వీర్ నానమ్మ తాతయ్యలు భారత్‌కు వలస వచ్చారు. రణ్‌వీర్‌కు అక్క రితికా భవ్నానీ ఉన్నారు. ముంబై, అమెరికాలలో రణ్‌వీర్ చదువుకున్నారు. చదువు పూర్తి చేసుకుని తిరిగి ఇండియా వచ్చిన తర్వాత కొన్ని అడ్వర్టైజింగ్ కంపెనీలలో కాపీ రైటర్‌గా పనిచేశారు రణ్‌వీర్. ఈ దశలో సినిమాలపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించారు.

గల్లీబాయ్ నుంచి ధురంధర్‌గా
రణ్‌వీర్ నటనపై ముచ్చటపడిన యష్‌రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా ఆయనను బాండ్ బాజా బరాత్ మూవీలో హీరోగా సెలెక్ట్ చేశారు. అదే రణ్‌వీర్ తొలి సినిమా. ఆ తర్వాత లూటేరా, గోలియాన్ కి రాసలీల రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, సింబా, గల్లీ బాయ్, 83, రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమాలతో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా రణ్‌వీర్ సింగ్ ఎదిగారు. రామ్‌లీలా సినిమాలో తనతో కలిసి నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెతో ప్రేమలో పడిన రణ్‌వీర్.. సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత 2018 అక్టోబర్‌లో ఆమెను పెళ్లాడారు. ఈ దంపతులకు కుమార్తె దువా పదుకొనె సింగ్ సంతానం.
ధురంధర్‌తో ఇంటర్నేషనల్ ఫేమ్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ సిరీస్‌తో రణ్‌వీర్ సింగ్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయారు. ఈ మూవీలో రా ఏజెంట్‌గా అద్భుతంగా నటించారు. దేశభక్తి సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్‌లో ఇరగదీశాడు. ఈ సినిమాలో ఆయన హమ్జా అలీ మజారీగా, జస్కిరత్ సింగ్ రంగీగా నటించారు. ధురంధర్ తర్వాత నుంచి అందరూ ఆయనను హంజా అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సినిమా ఇచ్చిన ఫేమ్‌తో రణ్‌వీర్ నెక్ట్స్ మూవీపై అంచనాలు నెలకొన్నాయి.
రణ్‌వీర్ సింగ్ ఆస్తులు
ధురంధర్ 2 బ్లాక్ బస్టర్ నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. భారతీయ సినీ, రాజకీయ, మీడియా రంగాల ఫోకస్ మొత్తం రణ్‌వీర్ పైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులు ఎంత అనే చర్చ కూడా మొదలైంది. రణ్‌వీర్ సింగ్ ప్రధానంగా సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, పెట్టుబడుల ద్వారా ఆదాయాన్ని అందుకుంటున్నారు. సినిమాకు 40 నుంచి 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నారు రణ్‌వీర్. ఇక బ్రాండ్ అండార్స్‌మెంట్స్ కింద ఒక్కో యూనిట్‌కు 3 నుంచి 5 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
రణ్‌వీర్‌కు ముంబైలో అత్యంత విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని విలువ 120 కోట్ల రూపాయల పైమాటే. తన భార్య దీపికతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి అలీబేగ్‌లో 22 కోట్ల రూపాయలతో లగ్జరీ విల్లా కొనుగోలు చేశాడు. అలాగే వోర్లీలో 40 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ కూడా ఉంది. ఇక ఖరీదైన వాచ్‌లు కొనుగోలు చేయడం అంటే రణ్‌వీర్‌కు మక్కువ. ఆయన వద్ద అత్యంత విలువైన ఫ్రాంక్ ముల్లర్ వాన్‌గార్డ్ యాచింగ్ వాచ్ ఉంది. వజ్రాలు, రేర్ మెటల్స్‌తో తయారైన ఆ వాచ్ ధర 2.1 కోట్ల రూపాయలని అంచనా. అలాగే రణ్‌వీర్ గ్యారేజీలో 5 కోట్ల రూపాయల విలువైన ఆస్టాన్ మార్టిన్ రాపిడ్ ఎస్ కారుతో పాటు లంబోర్ఘినీ ఉరస్, మెర్సెడస్ మెబాచ్ జీఎల్ఎస్ 600, రేంజ్ రోవర్ సహా ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తంగా రణ్‌వీర్ సింగ్ ఆస్తుల విలువ 450 కోట్ల పైమాటేనని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications


















