ఓ ఇంటివాడయిన కార్తికేయ.. కొత్త జంటకు చిరు ఆశీసులు.. ప్రియుడితో పాయల్ హల్చల్!
టాలీవుడ్ లో ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో తెరంగ్రేటం చేసిన కార్తికేయ గుమ్మకొండ ఇప్పుడు కుర్ర హీరోలందరితో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ వెళుతున్నారు. అయితే ఆయన ఎట్టకేలకు ఒకింటి వాడయ్యారు. ఆయన వివాహం ఆదివారం నాడు జరగగా వివాహానికి చిరు హాజరై దీవించారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆర్ఎక్స్ 100 సినిమాలో
ప్రేమతో మీ కార్తీక్ సినిమా ద్వారా అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయినా వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాతో కార్తికేయకి మంచి గుర్తింపు లభించింది. ఆర్ఎక్స్ 100 సినిమాలో శివ పాత్ర ద్వారా కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కార్తికేయ వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోకుండా చాలా సెలెక్టివ్ గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.

ప్రేయసి లోహితతో
ప్రస్తుతం రాజా విక్రమార్క అనే సినిమాలో ఆయన హీరోగా నటిస్తుండగా ఈ సినిమా త్వరలో విడుదలకు కూడా సిద్ధమవుతోంది. అయితే అనూహ్యంగా ఆయన ఆగస్టు నెలలో తన చిరకాల ప్రేయసి లోహితతో నిశ్చితార్ధ చేసుకున్నారు. తన బెస్ట్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ అయింది అనే విషయాన్ని మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను అని చెబుతూ కార్తికేయ సోషల్ మీడియాలో అప్పట్లో పోస్ట్ చేశారు.

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో
ఆమెను ఎన్ఐటి వరంగల్ లో చదువుకుంటున్నప్పుడు కలిశానని అప్పుడే నేను హీరో ఐయ్యాక వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానని ఆయన మొన్న రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వెల్లడించారు. రాజా విక్రమార్క ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మరోసారి సినిమా స్టయిల్ లో లోహితకు తన ప్రేమను వ్యక్తంచేశాడు. అదే రోజు పెళ్లి తేదీని కూడా ప్రకటించాడు.

ఓ ఇంటివాడయ్యాడు
అయితే మొత్తం మీద ఓ ఇంటివాడయ్యాడు హీరో కార్తికేయ. తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆదివారం ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహితను పెళ్లి చేసుకున్నాడు. కార్తికేయ పెళ్ళికి మెగాస్టార్ చిరంజీవి హాజరయి నూతన వధువరులను ఆశీర్వదించారు. కార్తికేయ పెళ్ళికి బంధువులతో పాటు పలుగురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఎవరెవరు వచ్చారంటే?
వరుడు కార్తికేయ క్రీమ్, కలర్ షేర్వాణీతో కనిపిస్తూ ఉండగా పెళ్లికూతురు బంగారు రంగు దుస్తుల్లో, వాటికి తగ్గ జ్యూవెలరీలో మెరిసిపోయింది. హీరో కార్తికేయ పెళ్లికి చిరంజీవి, అల్లు అరవింద్, తనికెళ్ల భరణి, సాయికుమార్ లాంటి ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్తికేయ తొలి హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, తన ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైంది. కార్తికేయ ఫస్ట్ డైరెక్టర్ అజయ్ భూపతి తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరై, దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
చివరిగా రాజా విక్రమార్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ప్రస్తుతానికి అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపిస్తున్నాడు. మరో పక్క ఆయన మరో తెలుగు సినిమా అయితే ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన మంచి కధలను సెలెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











