‘2 సార్లు దురదృష్టం, అలా యాక్సిడెంట్ వెంటాడింది.. పవన్ కల్యాణ్ నాకు సర్వస్వం’
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఇటీవల రోడ్డు, భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షిత చర్యలు ఎలా చేపట్టాలనే విషయంలో అందరికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ అండ్ క్యూరియస్ అనే పేరుతో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎమోషనల్‌గా, ఫన్నీగా సమాధానాలు ఇచ్చారు. సాయి దుర్గ తేజ్ ఇచ్చిన జవాబుల వివరాల్లోకి వెళితే..
నా జీవితంలో పవన్ కల్యాణ్ గారు కీలకంగా వ్యవహరించారు. చిన్నప్పటి నుంచి నాకు మార్గదర్శకుడిగా మారి.. నన్ను ముందుకు నడిపించారు. ప్రతీ విషయంలో గైడ్ చేస్తూనే ఉన్నారు. యాక్టింగ్ ట్రైనింగ్, జిమ్నాస్టిక్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్ లాంటి మార్షల్ ఆర్ట్స్‌ను నేర్పించారు. చాలా విషయాల్లో నాకు గురువులాంటి వారు. స్కూల్, కాలేజీలో నాకు ఫేవరేట్ టీచర్‌లా అనిపిస్తారు. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు అని సాయి దుర్గ తేజ్ తెలిపారు.

నేను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకొన్న తర్వాత.. మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పకుండా నా ప్రొఫైల్ పట్టుకొని చాలా ఆఫీసులకు తిరిగాను. నేను నా ఫోటోలు, బయోడేటా ఇస్తే.. వాటితో పల్లీలు, బఠానీలు తినడానికి వాడే వారు. అలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సమయంలోనే మంచు మనోజ్ ఆఫీస్‌లో నన్ను వైవీఎస్ చౌదరీ గారు చూశారు. ఆ తర్వాత నాకు ఆడిషన్ టెస్ట్ నిర్వహించారు. అలా రేయ్ సినిమా ప్రారంభమైంది. అయితే దురదృష్టం వెంటాడటంతో ఆర్థిక సమస్యలతో ఆ సినిమా ఆగిపోయింది అని సాయి దుర్గ తేజ్ తెలిపారు.
నా తొలి సినిమా ఆగిపోయిన తర్వాత మళ్లీ బయోడేటాలు పట్టుకొని పలు సినిమా ఆఫీసులు, నిర్మాత, దర్శకులను కలిశాను. ఆ తర్వాత ఓ సినిమా మొదలైంది. కొంత మేరకు షూటింగ్ పూర్తయిన తర్వాత అందులో నటిస్తున్న ఓ సీనియర్ నటుడు ఆకస్మాత్తుగా మరణించారు. దాంతో ఆయన స్థానంలో జగపతి బాబు గారిని పెట్టి రీ షూట్ చేశాం. అయితే పొలిటికల్ రీజన్స్ వల్ల ఆ సినిమా కూడా ఆలస్యమైంది. అయితే నా పట్టుదలను, ప్రయత్నాలను ఆపలేదు అని సాయి దుర్గతేజ్ చెప్పారు.
నా లైఫ్‌లో ప్రతీ విషయాన్ని తేలికగానే తీసుకొంటాను. దేనిని కూడా సీరియస్‌గా తీసుకొను. నాకు ఎంత నష్టం, చెడు జరిగిన ఆ పరిస్థితిని నవ్వుకుంటూ దాటేస్తుంటాను. అయితే అనుకోకుండా నాకు భారీ యాక్సిడెంట్ జరిగింది. చాలా రోజులు కోమాలోను ఉన్నాను. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాను. అయితే నేను కోమాలో ఉన్న విషయాన్ని నేను ఎప్పుడూ, ఎవరికి చెప్పలేదు. హాస్పిటల్‌కు చిల్ అవ్వడానికి వెళ్లాను అని నవ్వుతూ చెప్పేవాడిని అని అన్నారు.
రోడ్డు ప్రయాణాలు, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించండి. అతి వేగంగా వెళ్లకండి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. యాక్సిడెంట్ తర్వాత నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. మాటలు కూడా సరిగా రాలేదు. చాలా వ్యయామం చేసి బాడీని ఫిట్‌గా చేసుకొన్నాను. ఆ సమయంలో చాలా పుస్తకాలు చదివాను. నా వద్ద ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్, మహేంద్ర థార్ అంటే చాలా ఇష్టం. నాకు డ్రీమ్ కారు లాంటి 1968 షెల్బీ జీటీ 500 మస్టంగ్ మోడల్ కారు ఇష్టం. ఎప్పటికైనా దానిని కొంటాను అని అన్నాడు.


Click it and Unblock the Notifications











