బాలీవుడ్‌లోకి తెలుగు యంగ్ హీరో సత్యదేవ్: అక్షయ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్టులో కీలక పాత్ర
స్వయంకృషితో సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించుకున్న హీరోల్లో యంగ్ టాలెంటెడ్ స్టార్ సత్యదేవ్ ఒకడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను పోషించిన అతడు.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'జ్యోతి లక్ష్మీ' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇందులో మంచి నటనతో ఆకట్టుకోవడంతో వరుసగా ఆఫర్లను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మాంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరొందాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే సత్యదేవ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న తాజా చిత్రం 'రామ్ సేతు'. చారిత్రక నేపథ్యం ఉన్న రామ సేతుపై పరిశోధనలు చేసే ఆర్కియాలజిస్టుగా ఇందులో అతడు నటిస్తున్నాడు. ఈ సినిమాను అభిషేక్ శర్మ డైరెక్ట్ చేయనుండగా, అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతోపాటు విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ హిందువుల పవిత్ర ప్రదేశం అయిన అయోధ్యలో ప్రారంభం అయింది. ఇక, ఇందులోనే సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

మరోవైపు వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు సత్యదేవ్. గత ఏడాది 'ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య'తో భారీ విజయాన్ని అందుకున్న అతడు.. ఇప్పుడు 'తిమ్మరసు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. దీనితో పాటు 'బ్లఫ్ మాస్టర్' దర్శకుడు గోపీ గణేష్ తెరకెక్కించనున్న 'గాడ్సే'లోనూ నటిస్తున్నాడు. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'లూసీఫర్' రీమేక్‌లోనూ సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. దీంతో ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











