అతడి అంతం చూశాకే.. రామోజీరావు మరణం: రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
మీడియా మొఘల్‌గా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు వేలాది మంది ప్రతిభావంతులైన జర్నలిస్టులను దేశానికి అందించారు. పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, స్టూడియో అధినేతగా, వ్యాపారవేత్తగా రామోజీరావు అడుగుపెట్టన ప్రతిరంగంలోనూ విజయం సాధించారు.
దశాబ్ధాలుగా తమ దైనందిన జీవితంలో భాగమైన రామోజీ ఇక లేరని తెలిసి తెలుగు ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఆయన మరణవార్త తెలిసిన నాటి నుంచి దేశ , విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు వ్యక్తిగతంగా , సోషల్ మీడియా ద్వారా రామోజీరావుకు నివాళులర్పిస్తున్నారు. అయితే రామోజీరావు నివాసానికి వచ్చిన కొందరు ప్రముఖులు .. రాజకీయంగా వేధింపులు రావడం వల్లే చివరి రోజుల్లో తీవ్ర క్షోభను అనుభవించారని చెబుతున్నారు. నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తొలుత ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఆయన ఏమన్నారంటే.. '' రామోజీరావు గారు దైవసన్నిధిలోకి వెళ్లారని.. ఈ సందర్భంగా ఒక్క మాటను మాత్రం మనం గుర్తు చేసుకోవాలి. అంతటి మహానుభావుడు దరిద్రపు, చెత్త రాజకీయాల వల్ల చివరికి మన: క్షోభ అనుభవించి వెళ్లారు. అది భగవంతుడు చూసుకుంటాడు. ఆల్రెడీ చూసుకున్నాడు. ఆ గెలుపును చూసే వెళ్లిపోయారు. ఆ విషయంలో చాలా చాలా సంతోషం. ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్లారు.
ప్రపంచం బతికున్నంత వరకు కొంతమందే బతికి ఉంటారు. అందులో రామోజీరావు గారు ఒకరు.. అది ఒక చరిత్ర '' అంటూ రాజేంద్రప్రసాద్ ముగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ కాసేపటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్ధీవదేహానికి నివాళుర్పించి, రాజేంద్రప్రసాద్ తరహాలోనే వ్యాఖ్యలు చేశారు. ప్రమాణ స్వీకారం పూర్తవ్వగానే వచ్చి ఆయనను కలుద్దామనుకున్నానని, కానీ ఇంతలోనే ఇలా జరిగిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రామోజీరావును ఇబ్బంది పెట్టాయని.. అయినప్పటికీ వాటిని తట్టుకుని నిలబడ్డారని ప్రశంసించారు. ఆయనను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు లేవని పవన్ అన్నారు.
రాజేంద్రప్రసాద్ , పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ని ఉద్దేశించినవే అని నెటిజన్లు చెబుతున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో రామోజీరావును జగన్ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఒకానొకదశలో ఆయనను అరెస్ట్ చేయాలని కూడా భావించింది. అయితే రామోజీరావు వయసు, అనారోగ్యం.. పలు ఒత్తిళ్ల కారణంగా జగన్ వెనక్కి తగ్గారని రాజకీయ విశ్లేషకులు అంటారు. లేనిపక్షంలో జగన్ అంతటి సాహసం చేసేవారే.
ఈ సంగతేమో కానీ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే గట్స్ ఉండాలని, మీకు హ్యాట్సాఫ్ సార్ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. అలాగే రాజేంద్రప్రసాద్ - ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రంలోని క్లైమాక్స్ ఫోటోని మరో యూజర్ పంచుకున్నాడు. అందులో విలన్ జగపతిబాబు నష్టపోయి, వూరు నుంచి పారిపోయే సన్నివేశాన్ని హాస్పిటల్ బెడ్‌పై నుంచే హీరో తండ్రి రోల్ చేసిన రాజేంద్రప్రసాద్ టీవీలో చూసి కన్నుమూస్తాడు. దానిని ప్రస్తావిస్తూ రీల్ లైఫ్‌లో రాజేంద్రప్రసాద్ చేసిన రోల్‌ను రియల్ లైఫ్‌లో రామోజీ చేశారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరో యూజర్ అయితే నా అభిమాన నటులైన మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తానికి రాజేంద్రప్రసాద్ సరికొత్త వివాదానికి తెరలేపాడనే వాదనలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











