వరుస ఫ్లాపులతో అప్పుల్లోనే.. 6 ఏళ్లలో షర్ట్ కూడా కొనలేక... శర్వానంద్ ఎమోషనల్
ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల రద్దీ బాగా ఎక్కువగా కనిపించింది. చిన్నా పెద్ద కలిపి దాదాపు 7 సినిమాల వరకు విడుదలయ్యాయి. ఈ పోటీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీ విన్నర్‌లుగా నిలిచినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీరిలో శర్వానంద్‌కు హిట్ కొట్టడం అత్యంత కీలకం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉండటంతో ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తాను వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతూ శర్వానంద్ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కొద్దినెలల క్రితం దర్శకుడు తరుణ్ భాస్కర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్వానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...
చిన్నాచితకా పాత్రలతో టాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించారు శర్వానంద్. ఆ తర్వాత వెన్నెల, అమ్మ చెప్పింది, గమ్యం చిత్రాలతో నటుడిగా నిలబడ్డారు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు చిత్రాలతో శర్వానంద్ స్టార్ హీరోగా దూసుకొచ్చాడు. కానీ ఆ తర్వాత గడిచిన ఆరేడు ఏళ్లుగా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు శర్వా. రణరంగం, జాను, శ్రీకరం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు ఇలా ఒకదాని తర్వాత మరొకటి బోల్తా కొట్టాయి. కెరీర్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్ధితుల్లో నారీ నారీ నడుమ మురారి మూవీ శర్వానంద్ ఆశలను నిలబెట్టింది.

ఈ సినిమా హిట్ సాధించడంతో వరుసపెట్ట ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్న శర్వానంద్.. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయటపెట్టారు. ఇండస్ట్రీలో తాను ఎంతోమందికి సాయం చేశానని, కానీ నేను ఆపదలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషిని మనిషి నమ్మలేని పరిస్ధితులు వచ్చేశాయని.. ఇకప జాగ్రత్తగా ఉంటానని శర్వానంద్ అన్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు తరుణ్ భాస్కర్ గతంలో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
పడిపడి లేచేను మనసు సినిమాను చాలా నమ్మి చేశాం.. ఎంత నమ్మానంటే గ్యారంటీగా ఆడుతుందని 130 రోజులకు పైగా ఎండల్లో, వానల్లో కష్టపడి పనిచేశాం. ఆ సినిమా పోయినప్పుడు షాకయ్యా.. 3 నెలల పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఒక పీరియడ్‌లో వరుసపెట్టి నా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుంటే తప్పులు ఎక్కడ చేస్తున్నాను? సినిమాలు ఎక్కడ కొట్టేస్తున్నాయి? అనే దాని గురించి ఆలోచించేవాడిని. కొంచెం బ్రేక్ తీసుకుని, అసలు సినిమాలు ఎందుకు చేస్తున్నాను అని విశ్లేషించేవాడిని. పెయిన్ వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంతో సినిమా ఒప్పుకోవడానికి ముందు పది మందికి స్క్రిప్ట్, డైలాగ్స్ ఇలా ప్రతీది చూపిస్తున్నాను. పాత సినిమాల్లో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదని నిర్ణయించుకున్నానని శర్వానంద్ తెలిపారు
కో అంటే కోటీ అనే టైంలో మా అమ్మ బంగారం తీసుకుని సినిమాలు తీసినా నష్టపోయా. కథలో తప్పులు ఉన్నాయి.. ఈ సినిమాకు నేనే నిర్మాతని కావడంతో జీవితంలో వరస్ట్ కండీషన్‌కి వచ్చేశా. గమ్యం, ప్రస్థానం వచ్చి నాలుగైదు సంవత్సరాలు గడిచిపోయింది, వరుసగా ఫ్లాపులు ఉన్నాయి. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తే సినిమాలు పోయాయి, డబ్బులు పోయాయి. డబ్బుల వల్ల ఎంతోమంది స్నేహితులను, రిలేషన్స్‌ని కోల్పోయా. డబ్బుకు అంత ఇంపార్టెన్స్ ఉంటుందా? అని ఆలోచించలేదు, డబ్బు పోయేసరికి దానిని తీసుకోవడం బాధ అనిపించింది. అప్పులు కట్టడానికి ఆరేళ్లు పట్టింది. ఏ సినిమా చేసినా పేరెంట్స్‌కి, ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అందరికీ ఇస్తూ వచ్చా. ఆరేళ్లలో కనీసం ఒక్క కొత్త షర్ట్ కూడా కొనుక్కోలేదు. అంత మొండిగా బతికానని శర్వానంద్ ఎమోషనల్ అయ్యారు.
రన్ రాజా రన్ హిట్ అయినప్పుడు ప్రభాస్ అన్న పిలిచి పార్టీ ఇచ్చాడు. అరేయ్ హిట్ కొట్టావురా ఎంజాయ్ చేయరా.. ముఖం ఎందుకు అలా పెట్టుకుంటున్నావు, చెప్పండ్రా వీడికి అనేవాడు. నేను మాత్రం హిట్ కొట్టానా? అని ఆలోచించేవాడిని. హిట్ కొట్టి చాలా రోజులు అయిపోయింది... మండే తర్వాత మాట్లాడతా అనేవాడిని. అలా సక్సెస్ వచ్చినా ఎంజాయ్ చేయలేకపోయేవాడిని. ఎక్స్‌ప్రెస్ రాజాకి అలాగే పార్టీకి పిలిచాడు.. ఈసారి అయినా నమ్ముతావా అని ప్రభాస్ అన్న అడగ్గా.. మండేదాకా నమ్మను అని చెప్పేవాడిని. ఇప్పటికీ కూడా మండే సిండ్రోం ఉంది. మండే కలెక్షన్స్ చూసి డిసైడ్ అవుతా, ఫస్ట్ టూ డేస్ కూడా నేను నమ్మనని శర్వానంద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయన ఓపికను ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











