‘ఆమె పక్కన వీడా అంటూ నా ముఖం మీదే.. ఇప్పుడు ఆ హీరోయినే పిలిచి మరి హగ్’
సినీ వినీలాకాశంలో ధ్రువతారలో వెలుగొందాలని ఎంతో మంది యువతీ యువకుల కల. కోటీ ఆశలతో చెన్నై, ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లో అడుగుపెట్టి.. ఇక్కడికి వచ్చాక కానీ అసలు తత్వం బోధపడదు. అవకాశాలు అంత తేలికగా దొరకవు, దొరికినా అది చిన్నాచితకా పాత్రలే. తిరిగి వెనక్కి వెళ్లలేక.. ఏదో ఒకటి చేసుకుంటూ బతకడమే అని జీవితాన్ని నెట్టుకొస్తున్నారు కృష్ణానగర్‌లో ఎందరో. ఇవే కాదు.. కులం, మతం, ప్రాంతం, రంగును బట్టి కూడా అవమానాలు ఎదుర్కొన్నవారు సినీ పరిశ్రమలో ఎందరో ఉన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడి స్టార్‌లు ఎదిగిన వారు ఉన్నారు.
ఈ కోవలోకే వస్తాడు సుహాస్. బెజవాడకు చెందిన ఈ కుర్రాడు. తొలుత షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లు చేస్తూ సత్తా చాటాడు. మజిలీ సినిమాతో తన ప్రతిభను నిరూపించుకుని కలర్ ఫోటో అనే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మినిమం గ్యారెంటీ హీరోగా, ఓటీటీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుచున్నాడు. రంగ్ దే, అర్ధ శతాబ్ధం, ఫ్యామిలీ డ్రామా, హిట్, రైటర్ పద్మభూషణ్, మను చరిత్ర, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, శ్రీరంగ నీతులు, ప్రసన్న వదనం, డార్లింగ్ గొర్రె పురాణం, జనక అయితే గనక, ఉప్పుకప్పురంబు తదితర చిత్రాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ప్రస్తుతం కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్స్‌తో పాటు తమిళ చిత్రం మందాడిలో సుహాస్ నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. కేవలం 8 ఏళ్లకే సహాయ నటుడిగా, కమెడియన్‌గా, విలన్‌గా, హీరోగా 30 సినిమాలలో నటించాడంటే సుహాస్ దూకుడు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇదంతా అతనికి ఈజీగా రాలేదు. తన శరీర రంగును చూసి ఎన్నోసార్లు అవమానాలు పడ్డానని పలుమార్లు తెలిపాడు సుభాష్. తాజాగా మరోసారి కెరీర్ తొలినాళ్లలో జరిగిన చేదు ఘటనను పంచుకున్నాడు.
ప్రస్తుతం సుహాస్ హీరోగా నటిస్తోన్న మూవీ హే బల్వంత్. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్ర రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. గోపీ అచ్చెర దర్శకత్వం వహించారు. హే బల్వంత్‌లో శివానీ నాగారం హీరోయిన్‌గా నటిస్తుండగా.. వీకే నరేష్, సుదర్శన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. మహీరెడ్డి పాండుగుల సినిమాటోగ్రాఫర్‌గా, విప్లవ్ నైషదం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన హే బల్వంత్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యాడు.
సందీప్ కిషన్ అన్న నాకు ప్రతి సినిమాకు మేసేజ్ చేస్తాడు.. అన్నకి థ్యాంక్స్. నేను షార్ట్ ఫిలింస్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్ల జర్నీ.. నేను మంచిగా ఏ బాధలు లేకుండా ప్రశాంతంగా తడిగుడ్డ వేసుకుని నిద్రపోతే కూడా అంత మంచి కల రాదు. ఆ పదేళ్లు అంత మంచి కల. ఈ పదేళ్లలో షార్ట్ ఫిలింస్ చేశాను. మజిలీ రిలీజ్ అయ్యాక బ్రేక్ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ ఫీలయ్యా. ఎప్పటి నుంచో ఎదురుచూసిన క్షణం మజిలీ బ్రేక్ రావడం. ఆ హైలో ఉండగానే ఆ పది రోజుల్లో సినిమాలకు ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యింది. ఒక సినిమాకు ఆఫర్ ఉందని తెలిసి వెళ్లినప్పుడు.. ఒక పెద్ద హీరోయిన్ పక్కన మంచి క్యారెక్టర్ అని పిలిచారని సుహాస్ తెలిపాడు.
అక్కడికి వెళ్లినప్పుడు ఆ హీరోయిన్‌తో నువ్వు క్లోజ్‌గా ఉండే క్యారెక్టర్... ఇతనిని ఎందుకు పిలిచారని నా ముందే అన్నారు. ఆయనకి థ్యాంక్స్. ఎందుకంటే కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సుహాస్ - కీర్తి సురేష్ అని ఉప్పుకప్పురంబు అనే సినిమా వచ్చింది. కీర్తి సురేష్ గారికి నేను, మా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్. ఆవిడకి మా ఇంటి వంటలు తీసుకెళ్లే అదృష్టం పట్టింది. మా వైఫ్ చాలా రకాలు చేసి ఆమెకు పంపించేది. ఈరోజు ఒకరికొకరం మాట్లాడుకునే అదృష్టం దొరికింది. నువ్వు అనే స్టేజ్ నుంచి డే 1 రోజున కీర్తి సురేష్ గారు.. హాయ్ సుహాస్ అని హగ్ ఇచ్చారు. నా విషయంలో ఇది సక్సెస్. ఎవరైనా ఎప్పుడైనా నన్ను అన్నట్లే నీకేం తెలుసు.. నీకిది అవసరమా? అని అడిగినప్పుడు నవ్వి వదిలేయండి. తర్వాత మీరు సక్సెస్ అవుతారు చూడండి అప్పుడూ కూడా నవ్వే వదిలేయండి అని సుహాస్ అన్నారు.
హీరో అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి కదా... కానీ ఎ క్వాలిటీస్ లేని పెద్ద ఎగ్జాంపుల్ మీ ముందు నేనే ఉన్నాను. నేనే హీరో అయినప్పుడు మీరందరూ ఈజీగా అయిపోవచ్చు. నాకు ఫిబ్రవరి 20వ తేదీన ఇంకా పెద్ద సక్సెస్ వస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్లకి, ఈ స్టేజ్ మీదున్న వాళ్లకి అందరికీ పేరు పేరునా థ్యాంక్స్ అని సుహాస్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సుహాస్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











