టాలీవుడ్‌లోకి ఘట్టమనేని వారసుడు.. బాబాయ్‌ని మించి, మహేశ్ ప్లానింగ్ అదుర్స్
తెలుగు సినిమా చరిత్రలో సాహసానికి, మంచితనానికి మారుపేరు సూపర్‌స్టార్ కృష్ణ. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక .. ఆరు నూరైనా ఇచ్చిన మాట మీద నిలబడటం కృష్ణ గారి లక్షణం. అవసరమైతే కొండనైనా ఢీకొట్టగల ధైర్యం ఆయన సొంతం.తన వల్ల నష్టాలను ఎదుర్కొన్న నిర్మాతలకు రెమ్యునరేషన్ తిరిగిచ్చే ఆనవాయితీకి ఆద్యుడు సూపర్‌స్టార్ కృష్ణ. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక సొబగులు అద్ది నేడు హాలీవుడ్ రేంజ్‌కు టాలీవుడ్ వెళ్లడానికి బీజాలు వేసిన వారిలో ఆయన కూడా ఒకరు.
కృష్ణ కుటుంబం నుంచి ఆయన సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావులు నిర్మాతలుగా రాణించారు. తర్వాత రమేశ్ బాబు , మంజుల, మహేశ్ బాబు, సుధీర్ బాబు, కుమార్తె పద్మావతి కొడుకు గల్లా అశోక్‌లు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. వీరిలో కృష్ణగారి లెగసీని కంటిన్యూ చేస్తోన్నది మహేశ్ బాబే. టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరిగా.. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా మహేశ్ నిలిచారు. తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ నిజమైన శ్రీమంతుడిగా నిలిచారు.

నిజానికి కృష్ణ వారసుడిగా తొలుత ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఆయన పెద్ద కుమారుడు రమేశ్ బాబు. అల్లూరి సీతారామరాజు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన రమేశ్.. ఆ తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ వంటి చిత్రాల్లోనూ బాలనటుడిగా అలరించారు. అయితే సోలో హీరోగా రమేశ్ బాబు నటించిన మూవీ 1987లో వచ్చిన సామ్రాట్ సినిమా ద్వారా. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్‌పై హనుమంతరావు, ఆదిశేషగిరిరావు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు వి. మధుసూదనరావు దర్శకత్వం వహించారు.
ఈ సినిమా తర్వాత చిన్నికృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు వంటి సినిమాలలో రమేశ్ బాబు నటించినా హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. నిర్మాతగా అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు వంటి సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత సినీ నిర్మాణానికి దూరమైన రమేశ్ బాబు.. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కృష్ణ చనిపోయిన తర్వాత బాబాయ్ మహేశ్ బాబుతో కలిసి జయకృష్ణ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కృష్ణ బతికున్నప్పుడే తాతయ్య సూచన మేరకు జయకృష్ణ అమెరికా వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నారట. తన అన్న రమేశ్ బాబును ఎంతో ఇష్టపడే మహేశ్ బాబు.. జయకృష్ణ బాధ్యతల్ని తీసుకుని అతనిని హీరోగా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. తాజాగా బ్లాక్ సూట్‌లో స్టైలీష్ లుక్‌తో ఉన్న జయకృష్ణ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందం, లుక్‌లో బాబాయ్‌ని మించి అన్నట్లుగా ఈ ఫోటోలు ఉన్నాయని ఘట్టమనేని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ కుర్రాడి డెబ్యూ కోసం క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసే పనిలో మహేశ్ బాబు ఉన్నారట. ప్రస్తుతం స్టోరీ సెలక్షన్స్‌లో బిజీగా ఉన్న సూపర్‌స్టార్, ఓ ప్రముఖ బ్యానర్ చేతుల్లో జయకృష్ణ లాంచింగ్ బాధ్యతల్ని పెట్టనున్నారని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











