50 ఏళ్ల క్రితమే మంగళగిరిలో స్టూడియోకి ప్లాన్.. కృష్ణకు అడ్డుపడింది ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో గతంలో అటకెక్కించిన పనులను పట్టాలెక్కుతున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రం నుంచి నిధులు పొందడంతో పాటు గతంలో కేటాయించిన సంస్థలను అమరావతికి రప్పించాలని వారు పట్టదలతో ఉన్నారు. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి కూడా హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
జనసేన నేత కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరుగు పరుగున హైదరాబాద్ చేరుకుని విశ్వంభర సెట్‌లో మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఆ పని ముగించుకుని వచ్చేస్తే ఏ సమస్యా ఉండేది కాదు.. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌లోనూ స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీలో షూటింగ్‌కు అనుకూలమై ప్రదేశాలు చాలా ఉన్నాయని , రానున్న రోజుల్లో కోనసీమను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

ఆయన వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు ప్రభుత్వం టాలీవుడ్‌ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తుందా అన్న అనుమానాలు బయల్దేరాయి. ప్రత్యేకించి సినీ రంగానికి చెందిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దీంతో తన మార్క్ పాలనలో కనిపించాలని ఆయన భావిస్తున్నారు. దీనిలో భాగంగానే తన హయాంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి ప్రయత్నాలు బలంగా చేయాలని కసరత్తు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
విస్తారమైన సముద్ర తీరం.. గోదావరి జిల్లాలు, చారిత్రక కోటలు, పుణ్యక్షేత్రాలు, హార్స్‌లీ హిల్స్, తడ, తలకోన , గుట్టలు, లోయలు ఇలా ఒకేటేమిటి ఏపీలో షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు బోలెడు. అన్నింటికి మించి చిత్ర ప్రముఖులకు ఎంతో ఇష్టమైన విశాఖపట్నం రెడీగా ఉంది. ఇప్పటికే అక్కడ రామానాయుడు స్టూడియో అన్ని హంగులతో సిద్ధమైంది. విశాఖలో కానీ , అమరావతిలో కానీ స్టూడియోలు కట్టడానికి సినీ ప్రమఖులు నివసించడానికి భూములు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం కూడా రెడీ.
ఇప్పుడంటే ఏపీలో స్టూడియోలు కట్టమని ప్రభుత్వాలు రెడ్ కార్పెట్‌లు పరుస్తున్నాయి . కానీ.. ఎప్పుడో 50 ఏళ్ల కిందటే ఓ దిగ్గజ నటుడు స్టూడియో నిర్మించడానికి ముందుకు వస్తే ఆయనకు అన్ని రకాలుగా ఇబ్బందులు కల్పించి, పొగబెట్టి స్టూడియో నిర్మాణాన్ని నిలిపివేయించేలా చేశారు పరిశ్రమలోని కొందరు. ఆ నట దిగ్గజం ఎవరో కాదు.. నటశేఖర, సూపర్‌స్టార్ కృష్ణ. తెలుగువారి గుండెల్లో ఎవర్ గ్రీన్ హీరోగా, డేరింగ్ అండ్ డాషింగ్ స్టార్‌గా నిలిచిపోయారు కృష్ణ. చంద్రబాబు నాయుడు నడిబొడ్డుగా చెప్పి రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలోనే సూపర్‌స్టార్ స్టూడియో నిర్మాణానికి పూనుకున్నారు.

మద్రాసులో స్థిరపడిన తెలుగు చిత్ర పరిశ్రమను సొంత రాష్ట్రానికి తరలి రావాల్సిందిగా నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతో శ్రమించారు. అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో, రామానాయుడు రామానాయుడు స్టూడియోను నిర్మించే దిశగా కదులుతున్న సమయమది. కానీ కృష్ణ వారికి భిన్నంగా విజయవాడలో స్టూడియో కట్టాలని నిర్ణయించారు.
దీనికి కారణం లేకపోలేదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆ రోజుల్లో మద్రాస్ తర్వాత విజయవాడ కేంద్రంగా ఉండేది. నటీనటులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణుల్లో 90 శాతం మంది బెజవాడకే చెందినవారే. అలాగే ఎన్నో పంపిణీ సంస్థలకు కేంద్రంగా విజయవాడ విలసిల్లుతోంది. అందుకే కృష్ణ ఈ ప్రాంతంలో స్టూడియో కట్టాలని అనుకున్నారు. 1973లో మంగళగిరి ప్రాంతంలో స్టూడియో నిర్మిస్తానని , తనకు భూమి కేటాయించాలని నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావును కోరారు సూపర్‌స్టార్. 30 ఎకరాలను కృష్ణ కోరితే.. ప్రభుత్వం 20 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ నెలకొనడం కృష్ణకు ఇష్టం లేదంటూ కొందరు ప్రచారం చేశారు.
అంతేకాకుండా సీఎంపై ఒత్తిడి తీసుకొచ్చి స్టూడియో నిర్మాణానికి అడ్డుపడ్డారు. దీంతో మంగళగిరిలో స్టూడియో నిర్మాణం సాధ్యపడదని భావించిన కృష్ణ.. హైదరాబాద్‌లో పద్మాలయా స్టూడియోను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. నాటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ సహకారంతో పనులు మొదలుపెట్టి.. తన అభిమాన నటుడు , అన్నగారు నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పద్మాలయా స్టూడియోను ప్రారంభించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎవరెంతగా వెనక్కి లాగాలని ప్రయత్నించినా.. అనుకున్నది సాధించి అసాధ్యుడు అనిపించుకున్నారు కృష్ణ.. అందుకే ఆయన అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ..ఒన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్.


Click it and Unblock the Notifications











