పేపర్ బాయ్‌కి ప్రభాస్, మహేష్ సపోర్ట్ ఎందుకంటే..!
యువ హీరో సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా నటిస్తున్న చిత్రం పేపర్ బాయ్. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి చేస్తున్న చిత్రం ఇది. టీజర్, ట్రైలర్స్ తో ఆసక్తిని రేపింది. ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగష్టు 31 న విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి ఆడియన్స్ బాగానే చర్చించుకుంటున్నారు.
అంతగా ఈ చిత్రం జనాల్లోకి వెళ్ళడానికి మరో కారణం కూడా ఉంది. టాలీవుడ్ బిగ్ స్టార్స్ మహేష్, ప్రభాస్ ఇద్దరూ ఈ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ చాలా బావుందంటూ మహేష్ ఇటీవల ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు. ప్రభాస్ కూడా ప్రచారం కల్పిస్తున్నాడు.

ఈ చిత్ర హీరో సంతోష్ శోభన్ మరెవరో కాదు. మహేష్ , ప్రభాస్ తో బాబీ, వర్షం చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు శోభన్ తనయుడు. శోభన్ 2008 లో మరణించిన సంగతి తెలిసిందే. మహేష్ తో తెరకెక్కించిన బాబీ చిత్రం నిరాశపరిచినప్పటికీ ప్రతిభ గల దర్శకుడిగా శోభన్ కు గుర్తింపు తీసుకుని వచ్చింది. ఇక శోభన్ తెరకెక్కించిన వర్షం చిత్రం ప్రభాస్ కు తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

తమ దర్శకుడి కుమారుడు నటించిన చిత్రం కావడంతో ఈ ఇద్దరు స్టార్స్ ముందుకు వచ్చి ప్రచారం కల్పిస్తున్నారు. ట్రైలర్స్ లో సంతోష్ శోభన్ నటన, లుక్స్ బావున్నాయంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.


Click it and Unblock the Notifications











