Suriya : అప్పు కట్టడానికి హీరోగా.. 1200 జీతంతో ప్రస్థానం .. ఇప్పుడు నిమిషానికే కోట్లలో పారితోషికం!
జీవితం ఎవ్వరికీ పూల పాన్పు కాదు.. ఎప్పుడు ఎవరి జీవితం మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు స్టార్స్‌గా వెలుగొందుతున్న వారు ఆ స్థానానికి రావడానికి ఎంతో శ్రమించారు. ఇదంతా రాత్రికి రాత్రే వచ్చింది కాదు.. ఇందుకోసం ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య కూడా ఈ స్థాయికి ఎంతో శ్రమించారు. తండ్రి స్టార్ హీరో అయినప్పటికీ ఆయన ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు పడ్డారు. మే 1వ తేదీన సూర్య నటిస్తున్న రెట్రో విడుదల నేపథ్యంలో ఆయన గురించి వివరాలు చూస్తే :
తమిళ సీనియర్ నటుడు శివకుమార్, లక్ష్మీ దంపతులకు 1975 జూలై 23న చెన్నైలో జన్మించారు సూర్య. ఆయన అసలు పేరు శరవణన్. ఆయనకు తమ్ముడు కార్తీ, చెల్లెలు బృంద ఉన్నారు. చెన్నై లయోలా కాలేజీలో బీకామ్ చదవుకున్నారు. తండ్రి నటుడే అయినప్పటికీ సినీ రంగం వైపు రావాలని సూర్య అనుకోలేదు. కాలేజీలో చదువుకునే రోజుల్లో స్టేజ్ మీద జరిగిన అవమానంతో నటన, కెమెరా ముందుకు జీవితంలో రాకూడదని నిర్ణయించుకున్నారు. అయితే సూర్య డిగ్రీ పూర్తి చేసే సమయానికి తండ్రి శివకుమార్ కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయాల్సిన పరిస్ధితులు వచ్చాయి.

కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా సూర్య ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరారు. అప్పుడు రెండు నెలలకు గాను రూ.1200 వేతనం అందుకున్నారు. దీంతో తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి తనే సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి లాభాలు అందుకున్నారు. కానీ అక్కడ సంతృప్తి లేకపోగా.. అప్పుల భారం పెరిగిపోవడంతో సినిమా వైపు అడుగులు వేశారు. కానీ నటించడం రాక, డైలాగులు చెప్పలేక తొలినాళ్లలో ఎంతో ఇబ్బంది పడ్డారు సూర్య. రైలులో వెళ్తుండగా దిగ్గజ నటుడు రఘువరన్ అన్న మాటలతో బాధపడ్డ సూర్య.. కసిగా నటన నేర్చుకుని స్టార్‌గా అవతరించాడు.
1997లో ఇళయ దళపతి విజయ్ హీరోగా మణిరత్నం నిర్మాతగా వసంత్ దర్శకత్వంలో వచ్చిన నేరుక్కు నేర్‌లో ఓ చిన్నపాత్ర ద్వారా చిత్ర సీమలో అడుగుపెట్టారు. పోవెల్లం కెట్టుప్పార్, నంద, కాఖా కాఖా, పితామగన్, పేరాంగన్, ఆయుథ ఎజుత్తు, మాయావి, గజినీ, ఆరు, వారణం అయరిమ్, అయాన్, అధవన్, సింగమ్ చిత్రాలతో సూర్య స్టార్ హీరోగా అవతరించారు. గజినీ సినిమాతో ఆయన తెలుగు వారికి కూడా ఫేవరెట్‌గా మారిపోయారు. ఆ తర్వాత సూర్య నటించిన ప్రతి సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతూ కాసుల వర్షం కురిపిస్తోంది.
సూరారై పోట్రుతో ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు సూర్య. అగరం ఫౌండేషన్ స్థాపించి ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి వారు ఉద్యోగం పొందేలా సాయం చేస్తున్నారు సూర్య. ఈ విషయంలో తనకు నిర్మాత టీజే జ్ఞాన్‌వేల్ రాజా ఆదర్శమని ఆయన చెబుతారు. తన సహనటి జ్యోతికతో ప్రేమలో పడ్డ సూర్య కొన్నేళ్ల డేటింగ్ అనంతరం 2006లో ఆమెను పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తె, ఓ కుమారుడు సంతానం. సినిమాకు రూ.30 నుంచి 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే సూర్య.. బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఇతర వ్యాపారాలతో కోట్లు కూడబెడుతున్నారు. సూర్య ఆస్తుల విలువ రూ.250 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా. భార్య జ్యోతిక ఆస్తులు రూ.350 కోట్లు కూడా కలిపితే అది రూ.600 కోట్ల పైనే ఉంటుందని కోలీవుడ్ టాక్.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తన 44వ చిత్రం రెట్రోను మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు సూర్య. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తన 45వ సినిమాలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. ఇది సూర్యకు తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ. ఇది కాక వాడివాసల్ సినిమాలో సూర్య నటిస్తున్నారు. కష్టాలొచ్చినప్పుడు , అవమానాలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా కసిగా శ్రమిస్తే ఖచ్చితంగా విజయం లభిస్తుందని సూర్య జీవితం మనకు తెలియజేస్తోంది.


Click it and Unblock the Notifications











