ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే ఫిక్స్ అనుకున్నాం.. దిల్ రాజు షాకింగ్ రివీలేషన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా తీసుకెళ్లిన హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన నటించిన ప్రతి భారీ సినిమా వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం..అంకితభావం ఉంది. ముఖ్యంగా ఆయన కొన్ని సినిమాల కోసం ఎన్నో నైపుణ్యాలు నేర్చుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతున్నారు. అలాంటి ప్రభాస్ కెరీర్ లో ఓ సినిమా ఫ్లాప్ అవుతుందనీ, తనకు ఎడిటింగ్ రూమ్లోనే సినిమా రిజల్ట్ తెలిసిపోయిందని ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇంతకీ ఏ సినిమా ఏంటీ? ఈ సమయంలో దిల్ రాజు తీసుకున్న నిర్ణయమేంటీ?
ప్రొడ్యూసర్ దిల్ రాజు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఒక సినిమా హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అన్నది చాలా సార్లు ఎడిటింగ్ రూమ్లోనే అర్థమైపోతుందని చెప్పారు. 'ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం ఉంటే అది హిట్ అవుతుంది. అదే డౌట్ వచ్చిందంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఎక్కువ' అని ఆయన వివరించారు. అదే పరిస్థితి ప్రభాస్ నటించిన మున్నా (Munna) సినిమాకు కూడా వచ్చిందని చెప్పారు. దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియనా (Ileana D'Cruz) నటించింది. ఆ సమయంలో పోకిరి విజయంతో ఇలియానాకు భారీ క్రేజ్ ఉండటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మున్నా సినిమా విడుదలకు ముందు రోజు రాత్రే అది ఆశించిన విధంగా ఆడకపోవచ్చని తనకు అర్థమైందని దిల్ రాజు తెలిపారు. దీంతో తాను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను మొదట డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించానని గుర్తుచేసుకుంటూ, బయ్యర్ల కష్టాలు తనకు బాగా తెలుసని అన్నారు. అందుకే సినిమా విడుదలకు ముందు రోజు రాత్రే డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించానని చెప్పారు. 'సినిమా ఫలితం బాగాలేకపోవచ్చు. కానీ మీరు టెన్షన్ పడొద్దు.. మీకు నేను అండగా ఉంటాను' అని వారికి భరోసా ఇచ్చినట్లు దిల్ రాజు తెలిపారు.
నిర్మాతగా తనపై నమ్మకం పెట్టుకున్న వారిని మధ్యలో వదిలేయడం తనకు ఇష్టం లేదని కూడా చెప్పారు. అనుకున్నట్టుగానే మున్నా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే తర్వాత అదే నిర్మాత దిల్ రాజు, ప్రభాస్తో మరోసారి కలిసి పనిచేశారు. ఆ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ ఫర్పెక్ట్ ( Mr. Perfect) సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది.
సినిమా పరిశ్రమలో ఎక్కువ నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లేనని దిల్ రాజు పేర్కొన్నారు. సంవత్సరానికి విడుదలయ్యే 100 సినిమాల్లో కేవలం 10-20 సినిమాలే విజయవంతం అవుతాయని, మిగతా సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని ఆయన వివరించారు. సినిమా హిట్ అయితే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ లాభాలు పొందుతున్నారని అనుకుంటారని, కానీ ఫ్లాప్ సినిమాల వల్ల వారికి కలిగే నష్టాలను ఎవరూ పట్టించుకోరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే తాను తనతో పని చేసే డిస్ట్రిబ్యూటర్లను ఎప్పుడూ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
సినిమాల ఎంపిక విషయంలో కూడా దిల్ రాజు తన విధానాన్ని వెల్లడించారు. ముందుగా మంచి కథ సిద్ధం చేసుకుని, ఆ తర్వాత ఆ కథకు సరిపోయే హీరోను ఎంపిక చేస్తానని చెప్పారు. స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే వారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేయాల్సి ఉంటుందని అన్నారు. దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా నిర్మాణంలో ఉండే రిస్కులు, నిర్మాతలు ఎదుర్కొనే ఒత్తిడిని మరోసారి గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద హీరో సినిమా ఫలితం ముందే తెలిసినా నిర్మాతగా బాధ్యత తీసుకుని డిస్ట్రిబ్యూటర్లకు అండగా నిలబడిన తన అనుభవాన్ని ఆయన పంచుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











