HBD Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు కోట్ల ఆస్తులు.. అన్నీ ఆమె పేరు మీదనే రాసేశాడా!
స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు రౌడీ గాయ్ విజయ్ దేవరకొండ. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలను పోషించిన ఇతగాడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు.
సినిమాల పరంగానే కాదు.. బ్రాండ్ వాల్యూను కూడా భారీగా పెంచుకుంటూ దూసుకుపోతోన్నాడు. దీంతో వరుసగా మూవీలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడి గురించి కొన్ని విషయాలు మీకోసం!

గ్రాండ్‌గా మొదలైన కెరీర్
విజయ్ దేవరకొండ 'పెళ్లి చూపులు'తో హీరోగా పరిచయమయ్యాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరో అయిపోయాడు. అలాగే, 'మహానటి'లోనూ ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రలో కనిపించి మెప్పించాడు.

వరుస ఫ్లాపులతో ఇబ్బంది
ఆరంభంలోనే విజయ్ దేవరకొండకు ఎన్ని హిట్లు వచ్చాయో.. అదే స్థాయిలో ఫ్లాపులు కూడా వస్తున్నాయి. అప్పట్లో అతడు నటించిన 'ద్వారక' అనే సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత 'నోటా' 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దీంతో కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూనే వస్తోంది.

ఈ ప్రయోగాలన్నీ ఫెయిల్
విజయ్ దేవరకొండ 'లైగర్'తో పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లాలని అనుకున్నాడు. కానీ, ఈ చిత్రం కూడా డిజాస్టర్ అయింది. ఇది మాత్రమే కాదు.. దీని తర్వాత అతడు నటించిన 'ఖుషి', ఇటీవలే విడుదలైన 'ఫ్యామిలీ స్టార్' మూవీలు కూడా ఆశించిన రీతిలో ఆడలేదు. ఫలితంగా అతడికి వరుస దెబ్బలు తగిలాయి. అయినా విజయ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఆ సినిమాలతో సందడిగా
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. దీనితోపాటు ఈ యంగ్ హీరో రవి కిరణ్ కోలా అనే యంగ్ డైరెక్టర్‌తోనూ ప్రాజెక్టును లైన్‌లో పెట్టుకున్నాడు. ఈ చిత్రం రూరల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. ఇవి మాత్రమే కాదు.. ట్యాక్సీవాలా డైరెక్టర్‌తోనూ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.

నిర్మాత, బిజినెస్, సేవ
హీరోగా దూసుకుపోతోన్న విజయ్ దేవరకొండ.. బిజినెస్ రంగంలోనూ సక్సెస్ అయ్యాడు. అతడి క్లాత్ బ్రాండ్ 'రౌడీ'కి బయట ఎంతో ఆదరణ లభిస్తోంది. అలాగే, 'మీకు మాత్రమే చెబుతా'తో నిర్మాతగానూ మారాడు. ఇందుకోసం కింగ్ ఆఫ్ ద హిల్స్ అనే బ్యానర్‌ను సైతం స్థాపించాడు. అదే సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదర్శంగా ఉంటోన్నాడు.
ఎన్నో రికార్డులు.. ఫోర్బ్స్
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో మైలురాళ్లను చేరుకున్న విజయ్ దేవరకొండ.. చాలా రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 2018 జాబితాలో 72వ స్థానాన్ని, 2019లో 30వ స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటాడు. అలాగే, టాలీవుడ్‌లోని మరే హీరోకూ సాధ్యం కానీ రీతిలో ఏక కాలంలో నాలుగైదు బ్రాండ్లకు అంబాసీడర్‌గా చేస్తున్నాడు.

ఆస్తులు, రెమ్యూనరేషన్
విజయ్ దేవరకొండ తక్కువ సమయంలోనే స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు. దీంతో అతడు ఇప్పుడు ఒక్కో చిత్రానికి ఏకంగా రూ. 20 - 22 కోట్లు వరకూ చార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. అలా ఈ క్రేజీ హీరో ఒక్కో ఏడాదికి బాగా సంపాదిస్తున్నాడు. ఫలితంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ నికర విలువ దాదాపు రూ. 65 - 70 కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.
ఇంటి విలువ.. కార్లతో
విజయ్ దేవరకొండకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పెద్ద భవనం ఉంది. దీని విలువ సుమారు రూ. 50 కోట్లు ఉంటుందట. అలాగే, ప్రస్తుతం అతడు వాడుతోన్న కార్లు ఇతర యాక్సిసిరీస్‌ల విలువ రూ. 8 - 10 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇక, విజయ్ దేవరకొండ ఆస్తులన్నీ తన తల్లి దేవరకొండ మాధవి పేరిట రాసి ఉంచినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
నటుడిగా, నిర్మాతగా ప్రేక్షకులను అలరిస్తోన్న విజయ్ దేవరకొండ మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. అతడికి తెలుగు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











