హాకీ ప్లేయర్‌గా మారుతున్న మెగా హీరో: సరికొత్త అవతారం ఎత్తేందుకు సిద్ధం
టాలీవుడ్‌లోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, వారిలో కొందరు మాత్రమే సూపర్ సక్సెస్ అవడంతో పాటు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు. అయితే, వాళ్లెవరూ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయలేదు. కానీ, మెగా కాంపౌండ్ నుంచి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ ఒక్కడే ఫస్ట్ మూవీతోనే యాభై కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు క్రియేట్ చేశాడు. తద్వారా ఘనమైన ఆరంభాన్ని కూడా అందుకున్నాడు. ఈ హిట్ ఇచ్చిన జోష్‌లో ఉన్న ఈ మెగా హీరో.. వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుని పోతున్నాడు.
వైష్ణవ్ తేజ్.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఓ సినిమాను చేయబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పృథ్వీ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నాడట. అంతేకాదు, ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్‌గా కనిపించబోతున్నాడని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకోసం ఈ మెగా హీరో ఆ ఆటలో శిక్షణ కూడా తీసుకోబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్న కారణంగా అది సాధ్యం కావడం లేదని తెలిసింది. ఆ ప్రభావం తగ్గిన తర్వాత ట్రైనింగ్‌కు వెళ్తాడట.

ఇక, ఈ సినిమా కోసం అక్కినేని నాగార్జున.. వైష్ణవ్ తేజ్‌కు ఏకంగా రూ. 3 కోట్లు రెమ్యూనరేషన్‌గా చెల్లించబోతున్నాడని కూడా తెలుస్తోంది. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. 'ఉప్పెన' సినిమా విడుదల కాకముందే వైష్ణవ్ తేజ్.. క్రిష్ జాగర్లమూడితో సినిమాను పూర్తి చేశాడు. ఇది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో అతడికి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











