ఓటమికి తలవంచిన మెగాహీరో.. అయినా ఆపను అంటూ బహిరంగ లేఖ
టాలీవుడ్‌లో మంచి ఫామ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. నాగబాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో రాణిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి విలక్షణమైన సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకుని స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా విజయాల పరంపరతో ఫుల్ జోష్‌లో ఉన్న వరుణ్ తేజ్.. తాజాగా 'గని' అనే సినిమాను చేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. అయితే ఈ సినిమాకు సరైన స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో 'గని' మూవీ గురించి వరుణ్ తేజ్ స్పందించాడు. ఆయన ఏమన్నారు? అనే వివరాల్లోకి వెళితే

భారీ బడ్జెట్ తో
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో నటించిన చిత్రమే 'గని'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. నవీన్ చంద్ర నెగెటివ్ రోల్ చేశాడు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నదియా, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.

కష్ట పడ్డాడు కానీ
ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే అంత పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేదు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేక పోయింది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు కానీ అందుకు తగ్గ ఫలితం అయితే దక్కలేదు. కానీ మొదటి రోజు ఫలితం అర్థం కాకనో మరేమిటి సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ నిర్మాతలు ఆఫీస్ లో సంబరాలు చేశారు. కానీ ఇప్పుడు ఆసక్తికరంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పందించారు.

బహిరంగ ప్రకటన
సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోవడం ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోవడం కాకుండా వరుణ్ తేజ్ డిఫరెంట్ అనిపించేలా రియాక్ట్ అయ్యారు. తన సినిమా రిజల్ట్‌పై వరుణ్ తేజ్ బాహాటంగానే బహిరంగ ప్రకటన చేశాడు. తన ఓటమిని ఒప్పుకున్నారు. ''ఇప్పటి వరకు నాపై ప్రేమాభిమానాలు చూపించిన మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞతలతోనే ఉంటాను అని వరుణ్ తేజ్ పేర్కొన్నాడు.

ధన్యవాదాలు అంటూ
'గని' సినిమా మేకింగ్‌లో భాగమైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన మీరు ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారని నాకు తెలుసని అన్నాడు.మీరు అంతా మనసు పెట్టి పని చేశారని పేర్కొన ఆయన ఓ మంచి సినిమాను అందించాలనే తపనతో కష్టపడి సినిమా చేశామని అన్నారు. అయితే మేం చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాం అని వరుణ్ తేజ్ ఒప్పుకున్నాడు.

కష్టపడడం ఆపను అంటూ
మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి సినిమాకు మనసు పెట్టి పని చేస్తానని, ఎలా చేసి కొన్నిసార్లు సక్సెస్ అయ్యాను మరి కొన్నిసార్లు కొత్త విషయాలను నేర్చుకున్నానని వెల్లడించారు. అయితే కష్టపడటం ఎప్పటికీ ఆపను'' అని వరుణ్ తేజ్ ప్రేక్షకులకు ఒక లేఖ విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











