ఆఫర్లో ఏ బీర్ ఉంటే అదే తాగేవాళ్లం: విజయ్ దేవరకొండ
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా నటించిన చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. స్వరూప్ ఆర్ఎస్‌జె దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్క స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నవీన్ పొలిశెట్టి ఫ్రెండ్, టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు తరుణ్ భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నవీన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

'ఆరేళ్ల నుంచి నవీన్ పరిచయం. ఇద్దరం కలిసి థియేటర్ ఆర్ట్స్ చేశాం. ప్లే వర్క్ షాపులు చేశాం. చిన్న చిన్న బార్లలో కూర్చుని మందుకొట్టాం. ఆ సమయంలో ఈ రోజు ఆఫర్ ఏ బీర్ మీద ఉంది అని చూసుకుని, వన్ ప్లస్ వన్ ఆఫర్ ఏ బీర్ మీద ఉంటే అదే బీర్ తీసుకురమ్మని ఆర్డర్ చేసేవారం' అని విజయ్ గుర్తు చేసుకున్నారు.
'ఇద్దరం కలిసి ఎన్నో సినిమా ఆడిషన్లకు వెళ్లాం. ఆ రోజుల్లో ప్రయత్నాలు చేసీ చేసీ అవకాశాలు వస్తాయా? రావా? అని టెన్షన్ పడేవారం. 'లైఫ్ ఈజ్ బ్యూటిపుల్' చిత్రంలో కలిసి నటించాం. థియేటర్ చేసేపుడే నవీన్ యాక్టింగ్ స్కిల్, టాలెంట్ చూసి ఆశ్చర్యపోయేవాడిని, వీడిలా ఇండస్ట్రీలో ఎవరూ ఉండరు అని ఫీలయ్యేవాడిని, 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' విజయం సాధించడం ఆనందంగా ఉంది. త్వరలో నవీన్ మరో సినిమా చేయబోతున్నాడు, నా ఫ్రెండ్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను'' అని విజయ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











