విజయ్ దేవరకొండ ఖాతాలో అరుదైన రికార్డ్: దక్షిణాదిలోనే మొట్టమొదటి హీరోగా ఘనత
కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలతో మెప్పించాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ అవడంతో.. అతడికి మంచి పేరు వచ్చింది. దీని తర్వాత 'అర్జున్ రెడ్డి' మూవీతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని విజయ్.. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఈ రౌడీ స్టార్ తాజాగా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసున్నాడు.
విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. అందుకే అతడి ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా పది మిలియన్ల (కోటి మంది) ఫాలోవర్లను సంపాదించుకున్నాడీ క్రేజీ హీరో. టాలీవుడ్‌లో విజయ్ కంటే ముందే ఎంతో మంది స్టార్లు ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేసినప్పటికీ ఈ మార్కును ఎవరూ అందుకోలేదు. అంతెందుకు పది మిలియన్ల మార్క్ అందుకున్న సౌతిండియన్ స్టార్ మరొకరు లేదు. దీంతో దక్షిణాది మొత్తంలో విజయ్ ఒక్కడిదే ఈ రికార్డు.

ఇదిలా ఉండగా, వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటోన్న విజయ్ దేవరకొండ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మీతో కలిసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. ఇందులో హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జనవరి మొదటి వారం నుంచి పున: ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











