నాకు కబీర్ సింగ్ సినిమా చూడాల్సిన అవసరం లేదు: విజయ్ దేవరకొండ
'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండ రేంజి ఒక్కసారిగా మారిపోయింది. ఈ కల్ట్ మూవీలో విజయ్ తన నటనతో అందరినీ ఆకట్టుకుని స్టార్ హోదా సొంతం చేసుకున్నాడు. 'అర్జున్ రెడ్డి' మూవీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కగా అక్కడ కూడా భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ తీసిన సందీప్ వంగా... హిందీలోనూ దర్శకత్వం వహించారు.
తన నెక్ట్స్ మూవీ 'డియర్ కామ్రేడ్' ప్రెస్ మీట్లో పాల్గొన్న విజయ్ దేవరకొండకు 'కబీర్ సింగ్' గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. 'కబీర్ సింగ్' మూవీ చూశారా? అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ... 'నేను తెలుగులో చేసిన సినిమాను... షాహిద్ కపూర్ హిందీలో చేశాడు. నాకు కథ తెలుసు. అలాంటిపుడు మళ్లీ ఆ సినిమా చూడాల్సిన అసవరం ఏమిటి?' అంటూ ఎదురు ప్రశ్నించారు.

'సందీప్ వంగా నా మనిషి, ఆయన తీసిన హిందీ సినిమా కూడా పెద్ద హిట్టవ్వాలని కోరుకున్నాను. కానీ అది బ్లాక్ బస్టర్ అయింది. ఇంతకంటే సంతోషం ఏముంటుంది? దానికి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏముంది?' అని విజయ్ దేవరకొండ తెలిపారు.
డియర్ కామ్రేడ్ మూవీ విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన మూవీకి భరత్ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జూలై 26న విడుదలవుతుంది.


Click it and Unblock the Notifications











