రికార్డులు బద్దలు కొడుతున్న విజయ్ దేవరకొండ.. ఉత్తరాదిలో ఈ క్రేజ్ ఊహించి ఉండరు.!
విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. ఈ యంగ్ హీరో తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్నాడు. 'పెళ్లి చూపులు' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన ఈ క్రేజీ స్టార్.. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో యూత్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత అతడి ఖాతాలో 'గీత గోవిందం' వంటి భారీ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టు వచ్చి చేరింది. అయితే, ఈ మూవీ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. తాజాగా విజయ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అది కూడా ఉత్తరాదిలో కావడం విశేషం. ఇంతకీ ఏంటా ఘనత.? వివరాల్లోకి వెళితే...

ఏదో అనుకుంటో ఇంకేదో అయింది
విజయ్ దేవరకొండ గత ఏడాది నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మించిన ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది.

హిట్ కాకున్నా వాళ్లిద్దరూ హ్యాపీ
‘గీత గోవిందం' సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ‘డియర్ కామ్రేడ్'లో కలిసి నటించారు. ఈ సినిమాలో వీళ్లిద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా లిల్లీ పాత్ర చేసిన రష్మిక మెప్పించిందనే చెప్పాలి. అలాగే, కోపం.. ప్రేమ.. సహనం వంటి వేరియేషన్స్ చూపించిన విజయ్ కూడా చక్కని అభినయం కనబరిచాడు. దీంతో వీళ్లిద్దరికి మంచి పేరు వచ్చింది.

ఒక దగ్గర హిట్.. మరో దగ్గర ఫ్లాప్
తెలుగు ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పించలేకపోయిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం ఇరగదీసేసింది. గతంలో ఏ సినిమాకూ రాని స్థాయిలో దీనికి క్లిక్ వచ్చాయి. అయితే, ‘డియర్ కామ్రేడ్' బుల్లితెరపై మాత్రం నిరాశనే మిగిల్చింది. టెలివిజన్ ప్రీమియర్‌గా వచ్చిన ఈ సినిమా అర్బన్‌లో 5.47 రేటింగ్ సాధించింది. అయితే, ఓవరాల్‌గా మాత్రం 4.90 రేటింగ్‌నే దక్కించుకుంది.

రికార్డులు బద్దలు కొడుతున్న విజయ్
తాజాగా ‘డియర్ కామ్రేడ్' హిందీ డబ్బింగ్ వర్షన్ అదే పేరుతో యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు అంటే అక్షరాల 24 గంటల్లోనే 11 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో సినిమాకూ ఈ స్థాయి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటికీ ఈ సినిమా అదే స్పీడుతో దూసుకుపోతోంది.

విజయ్ క్రేజ్‌కు అది కూడా కారణమే..!
విజయ్ దేవరకొండ సినిమా ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఓ సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అతడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. దీనికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ సహా నిర్మాత. ఈ కారణంగానే విజయ్ సినిమాను హిందీ ప్రేక్షకులు బాగా చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











