ఏ క్షణంలో నైనా తప్పుకుంటా..! బతుకంటే భయం లేదు: విజయ్ దేవరకొండ
తెలుగు తెరపై అనతి కాలంలోనే అశేష అభిమాన వర్గాన్ని కూడట్టుకున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ''అర్జున్ రెడ్డి, గీత గోవిందం'' సినిమాలు ఆయనను క్రేజీ హీరోగా మార్చేశాయి. దీంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ మేనియా నడుస్తోంది. కేవలం వెండితెర పైనే కాదు.. స్టేజ్ ఎక్కినా కూడా విజయ్ దేవరకొండ మాటలతో మాయ చేస్తుంటాడు. ఆయన తాజా సినిమా డియర్ కామ్రేడ్. జులై 26 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన.. తన సినీ కెరీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తాను సినిమాల్లోంచి ఏ క్షణంలో అయినా తప్పుకునే ఛాన్స్ ఉందని పేర్కొని ఆశ్చర్యపరిచాడు. తనకు సినిమాల కంటే ఆసక్తికరమైన అంశం ఏదైనా ఉందని అనిపించినా, యాక్టింగ్ బోర్ కొట్టినట్లుగా ఫీలింగ్ వచ్చినా వెంటనే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పాడు విజయ్ దేవరకొండ. తాను ఎవరంటే జనం గుర్తుపట్టని స్టేజ్ నుంచి ఈ స్థాయికి వచ్చానని, ప్రస్తుతం తన వద్ద ఉన్న డబ్బుతో చాలాకాలం ఈజీగా బతికేయగలనని ఆయన అన్నాడు. అలాగే తాను స్టార్ డమ్ గురించి అస్సలు పట్టించుకోనని, తన జీవితంలో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వవని ఆయన తెలిపాడు. అందుకే తనకు బతుకంటే భయం లేదని విజయ్ దేవరకొండ చెప్పాడు. తన పెళ్లిపై కూడా స్పందించిన ఆయన.. మరో ఐదేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రెసెంట్ మూవీ 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. దీంతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ.


Click it and Unblock the Notifications











