తెలుగు మార్కెట్‌లో తలైవాపై దళపతిదే పైచేయి.. భారీ ధర పలికిన విజయ్ మూవీ
తెలుగువాళ్లకి సినిమాలంటే మహా పిచ్చి.. ఎలాంటి భాషాభేదం, తారతమ్యాలు లేకుండా ప్రపంచంలోని ఏ భాషకి చెందిన చిత్రాలనైనా, నటులనైనా నెత్తిన పెట్టుకుంటారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి స్మార్ట్ యుగం వరకు తెలుగువాళ్లకి సినిమా అనేది ఓ బావోద్వేగం. సినిమాని మనోళ్లు కేవలం వినోద సాధనంగా చూడరు.. అంతకుమించిన ఎమోషనల్ బాండింగ్ ముడిపడి ఉంది. భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా తెలుగులోకి డబ్ అయినా ఎగబడి చూస్తుంటారు తెలుగువాళ్లు.
మనదేశంలో ఎన్నో భాషల్లో సినిమాలు రిలీజ్ అవుతున్నా... తెలుగులోకి ఎక్కువగా డబ్ అయ్యేది మాత్రం తమిళ చిత్రాలే. దశాబ్ధాలుగా తెలుగు మార్కెట్‌ను క్యాష్ చేసుకున్న క్రెడిట్ కోలీవుడ్‌దే. స్వాతంత్య్రానికి పూర్వం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు వందలాది తమిళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయి, సూపర్‌హిట్ అయ్యాయి... ఇంకా అవుతూనే ఉన్నాయి. తమిళ అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, కార్తీక్, అజిత్, విక్రమ్ వంటి వారికి సొంత రాష్ట్రంలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో.. తెలుగునాట కూడా అంతే ఉంది.

ఇప్పుడంటే పాన్ ఇండియా కల్చర్ కాబట్టి.. ఏకకాలంలో ఐదారు భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు కానీ కోలీవుడ్ జనాలు గతంలోనే సినిమా తీసేటప్పుడే తెలుగువాళ్లని కూడా దృష్టిలో పెట్టుకుని ఒకే రోజున సినిమాలను దించిన చరిత్ర ఉంది. చెన్నైతో పాటు హైదరాబాద్‌లోనూ ఆడియో లాంచ్‌లు, సక్సెస్ మీట్‌లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇది ఎప్పటి నుంచో ఉంది.. రేపూ ఉంటుంది.
లేటెస్ట్‌గా రిలీజైన విక్రమ్ తంగలాన్ తెలుగునాట మంచి వసూళ్లని సాధిస్తోంది. గత వారం మంచి ఆక్యూపెన్సీ అందుకున్న ఈ చిత్రం ఈ వీక్ ఎలా సాగుతుందో చూడాలి. ప్రస్తుతం కోలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతున్నాయి. సూర్య నటిస్తోన్న కంగువా, సూపర్‌స్టార్ రజనీకాంత్ వెట్టియాన్, ఇళయ దళపతి విజయ్ నటిస్తోన్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్, కార్తీ నటిస్తోన్న వా వాథియార్, మెయ్యగన్ మూవీస్ వీటిలో ప్రధానమైనవి.

ఈ సినిమాల తెలుగు రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌ను రూ.30 కోట్లు పలికినట్లుగా సమాచారం. అలాగే తలైవా నటిస్తోన్న వెట్టియాన్ తెలుగు రైట్స్ రూ.14 కోట్లు పలికినట్లుగా ఫిలింనగర్ టాక్. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటిలు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏషియన్ సునీల్ తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకోగా.. సీడెడ్ రైట్స్‌ని ఎన్‌వీ ప్రసాద్ దక్కించుకున్నారు. ఆంధ్రా ప్రాంతం (నాన్ సీడెడ్) రైట్స్ రూ.8 నుంచి రూ.9 కోట్లకు అమ్ముడుపోగా.. నైజాం రైట్స్ రూ.7 కోట్లు పలికినట్లుగా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











