ఆంధ్రాలో అమ్మాయిల అక్రమ రవాణా.. పవన్ కల్యాణ్ చెప్పిందే నిజమైంది!
విదేశాల్లో ఉద్యోగాలు, చేతినిండా సంపాదన పేరుతో నమ్మించి మనుషులను కాంబోడియాకు విక్రయిస్తున్న ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. ఈ గ్యాంగ్ నుంచి ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈ ముఠా అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కాంబోడియాలో ఉద్యోగాల పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి లక్షల్లో వసూలు చేసి అక్కడికి పంపగా.. వీరిని మరికొన్ని గ్యాంగ్‌లు కొనుగోలు చేసేవని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మానవ అక్రమ రవాణా ముఠా అరాచకాలపై విశాఖ పోలీస్ కమీషనర్ రవిశంకర్ కీలక విషయాలు తెలిపారు.
విశాఖ నగరంలోని గాజువాక ఏరియాకు చెందిన చుక్క రాజేశ్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజర్‌గా పనిచేసి ఈ అనుభవంతో కన్సల్టెంట్‌గా మారాడు. తన వద్దకు వచ్చిన వారిని , ఫైర్ సేఫ్టీ చదివినవారిని విదేశాలకు పంపేవాడు. ఈ క్రమంలో సంతోష్ అనే వ్యక్తి రాజేశ్‌ను కలిసి కాంబోడియాలో ఉద్యోగాలున్నట్లు తెలిపి ఒక్కో అభ్యర్ధి నుంచి రూ.90 వేలు వసూలు చేస్తామని ఇందులో రూ.20 వేలు కమీషన్ ఇస్తామని రాజేశ్‌కు చెప్పాడు. కాంబోడియా వెళ్లినవారితో సైబర్ నేరాలు చేయిస్తామని, ఈ విషయం రహస్యంగా ఉంచాలని సూచించారు. అలా 27 మందిని కాంబోడియాకు పంపారు వీరిద్దరూ.

ఈ నేపథ్యంలో రాజేశ్‌కు ఆర్య, హబీబ్ అనే మరో ఇద్దరు ఏజెంట్లు పరిచయమై మరింత ఎక్కువ కమీషన్ ఆఫర్ చేశారు. దీంతో ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేసి దాదాపు 150 మందిని కాంబోడియాకు పంపించాడు. అక్కడికి వెళ్లిన వారిని ఆ దేశానికి కొందరు ఏజెంట్లు కాంబోడియా కంపెనీలకు 2500 నుంచి 4 వేల అమెరికన్ డాలర్లకు అమ్మేసేవారు. అనంతరం ఆ కంపెనీల నుంచి వారిని చైనాకు చెందిన కొందరు నిర్బంధించి వారితో బలవంతంగా సైబర్ మోసాలు చేయించేవారు. అలా వచ్చిన మొత్తంలో 1 శాతం వీరికి ఇచ్చి.. కంపెనీలు 99 శాతం దోచుకునేవని సీపీ వెల్లడించారు.
అక్కడితో ఆగకుండా వీరిని వ్యసనాలకు బానిసలుగా మార్చేవారని కమీషనర్ పేర్కొన్నారు. అయితే ఈ ముఠా బారి నుంచి తప్పించుకున్న ఓ విశాఖ వాసి అందించిన సమాచారంతో రాజేశ్ సహా మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు రవిశంకర్ తెలిపారు. ఈ గ్యాంగ్ గడిచిన రెండేళ్లలుగా విశాఖ, తుని, రాజమండ్రి, శ్రీకాకుళం, కోల్‌కతాలకు చెందిన దాదాపు 5 వేల మందిని కాంబోడియాకు పంపారని.. రెండేళ్ల కాలంలో రూ.100 కోట్లకు పైగా సైబర్ నేరాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని భారత విదేశాంగ శాఖకు, కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్తామని కమీషనర్ స్పష్టం చేశారు.
ఈ కేసు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వారాహి విజయయాత్ర సమయంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణా జరుగుతోందని , పెద్ద ఎత్తున ఆడపిల్లలు, మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 30 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని చెప్పారు.
మహిళల అదృశ్యంపై సీఎం , డీజీపీలు కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు రహస్యంగా సేకరిస్తున్న సమాచారం అసాంఘిక శక్తుల చేతికి వెళ్తోందని ఆయన ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. వాలంటీర్లు , మహిళా సంఘాటు రోడ్డెక్కగా.. తమకు వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ మహిళా కమీషన్ ఆదేశించింది. వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
కట్ చేస్తే తాజాగా విశాఖలో బయటపడ్డ మానవ అక్రమ రవాణా వ్యవహారం పవన్ వ్యాఖ్యలను గుర్తుచేస్తోంది. ఒక్క వైజాగ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ముఠాలు ఇంకెన్ని ఉన్నాయో, ఎంతోమందిని ఇలా దేశం దాటించారోనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విశాఖ ఘటన నేపథ్యంలో ఇలాంటి గ్యాంగ్‌లను పట్టుకుని, మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











