పవర్ స్టార్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు వచ్చేది ఎప్పుడంటే?
ప్రశ్నించడానికి, రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలనే లక్ష్యంతో పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన లక్ష్యం వేగంగా అడుగులు వేస్తున్నారు. పదేళ్ల నుంచి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆయన ఈసారి మాత్రం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ, బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. అభ్యర్ధుల తరపున రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతంగా ప్రచారం చేశారు. వాడి వేడి విమర్శలతో అధికార వైసీపీపై విరుచుకుపడటంతో పోటీ జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా సాగింది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కోసం మెగా ఫ్యామిలీ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారంలో కదం తొక్కారు.
మే 13న పోలింగ్ రోజున అంచనాలకు మించి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడటం.. 80 శాతం పైనే ఓటింగ్ నమోదు కావడంతో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారోనని పార్టీలు, అభ్యర్ధులు ఆందోళనకు గురవుతున్నారు.

ఏపీలో ఎన్నికల తర్వాత జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా.. విజయం ఎవరిని వరిస్తుందోనని కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ విజయంపైనే అందరి చూపు నెలకొంది. ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ఆయన ధీమాగా చెబుతున్నారు.
అంతాబాగానే ఉంది కానీ .. పవన్ కళ్యాణ్ అభిమానులను ఓ ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది. గత కొంతకాలంగా తీరిక లేకుండా రాజకీయాల్లో గడిపిన పవర్‌స్టార్ సినిమాల్లోకి వస్తారా, చేతిలో వున్న ప్రాజెక్ట్‌లు ఫినిష్ చేస్తారా.. అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ', క్రిష్ దర్శకత్వంలో 'హరిహరవీరమల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో ' ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో ఓజీ ఈ ఏడాది సెప్టెంబర్ 24న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్‌లో పవన్ పాల్గొనాల్సి వుంది. మిగిలిన రెండు చిత్రాల పరిస్ధితి ఇదే.

రేపు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగమవుతారు. అప్పుడు ఆయన ఖాళీగా ఉండటం .. సినిమాల్లో నటించడం అసాధ్యం. రాజ్యాంగ పదవుల్లో ఉండి సినిమాలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమైతే దానికి పరిష్కరాలు సూచిస్తున్నారు కొందరు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటికీ సినిమాల్లో నటించారు. ఎంజీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా సినిమాలు మానేయలేదు.
ఉత్తర భారతదేశంలోనూ అగ్ర నాయకులుగా చెలామణి అయిన నటులు సినిమాల్లో నటిస్తూనే ప్రజా సేవ చేస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లినంత మాత్రాన మేకప్ వేసుకోవడం తప్పేమీ కాదని పరుచూరి గోపాలకృష్ణ వంటి పెద్దలు గతంలో సూచించారు కూడా. గ్యాప్‌లేని రోజున రాజకీయాల్లో ఉండండి.. గ్యాప్ వచ్చిన రోజున సినిమాలు చేయండి అని పరుచూరి ఎప్పుడో సలహా ఇచ్చారు కూడా.

కాకపోతే పవన్ అంతరంగం ఎవరికీ అంతుచిక్కదు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టమేనని పవన్‌ని దగ్గరి నుంచి చూసినవాళ్లు చెప్పేమాట. అయితే జూలై చివరి వారంలో కానీ, లేదా ఆగస్టు తొలివారంలో కానీ పవన కల్యాణ్ షూటింగులకు హాజరు అవతారని చెబుతున్నారు. మరి సినిమాల విషయంలో పవర్‌స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











