‘నేనేమీ బ్రేక్ తీసుకోలేదు.. అలా సినిమాలకు దూరమయ్యా’
వడ్డే నవీన్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 90వ దశకంలో ఫ్యామిలీ, లవ్ , రొమాంటిక్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వడ్డే నవీన్. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు నవీన్. సీనియర్ హీరోలు సహాయ నటులుగా, విలన్‌లుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటికీ నవీన్ జాడ మాత్రం తెలియరాలేదు. దాంతో ఆయన ఏమైపోయారంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు వడ్డే నవీన్. ఈ క్రమంలోనే తాను సినిమాలకు ఎందుకు దూరమయ్యాను అనేదానిపై క్లారిటీ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
అలనాటి నిర్మాత వడ్డే నవీన్ వారసుడిగా సినీరంగ ప్రవేశం చేశారు వడ్డే నవీన్. 1997లో ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన కోరుకున్న ప్రియుడు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు వడ్డే నవీన్. ఆపై పెళ్లి, ప్రియా ఓ ప్రియా, తాంబూలాలు, స్నేహితులు, మనసిచ్చి చూడు, నా హృదయంలో నిదురించే చెలి, మా బాలాజీ, చాలా బాగుంది తదితర సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత వడ్డే నవీన్ చేసిన సినిమాలు డిజాస్టర్లు కావడంతో రేసులో వెనుకబడ్డారు. 2016లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన అటాక్ మూవీ వడ్డే నవీన్ చివరి సినిమా. అప్పటి నుంచి దాదాపు పదేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్నారు వడ్డే నవీన్. తాజాగా ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు నవీన్.

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ స్వయంగా ఈ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ సరసన యంగ్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కమల్ తేజ్ దర్శకత్వం వహిస్తుండగా.. శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, శ్రీనివాస్ వడ్లమాని, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా భాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు కీలకపాత్రలు పోషించారు. మే 21న హైదరాబాద్‌లో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ టీజర్ లాంజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా వడ్డే నవీన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇదే నా ఫస్ట్ ఫిల్మ్. చాలామంది ఫ్యాన్స్, చాలా మీడియా సంస్థలు కూడా అసలు వడ్డే నవీన్ గారు ఇక్కడున్నారా? లేదా? అనే సందేహం ఉంది. నేను ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఎక్కువ ప్రెస్‌లో కనిపించలేదు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోనే గడిపేవాడిని. అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఎక్కడో ఒక చోట నన్ను గుర్తుచేసుకుంటూనే ఉన్నారు... వారికి నా ధన్యవాదాలు. అసలు నేను సినిమాలు చేయకూడదని అనుకున్నాను. గీత గారు అడిగారు.. బ్రేక్ ఇచ్చారా? తీసుకున్నారా అని.. ఇక్కడ రెండూ ఉన్నాయి. బ్రేక్ ఎలా వచ్చిందంటే మంచి సినిమాలు నాకు నచ్చిన సినిమాలు రాలేదు.. వచ్చే సినిమాలు నేను చేయలేదు. రెండు విధాలుగా బ్రేక్ వచ్చింది. కానీ నాకు చాలా మంది కథలు వినిపిస్తున్నారు... వింటూ ఉన్నాను అని వడ్డే నవీన్ తెలిపారు.
దర్శకుడు కమల్ నా దగ్గరికి వచ్చినప్పుడు త్రిమూర్తులు క్యారెక్టర్ ఒకటే చెప్పాడు. క్యారెక్టర్ నచ్చింది.. టైటిల్ చెప్పాడు ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. ఈ రెండింటితో వన్ ఇయర్ కూర్చొని డెవలప్ చేశాం. అప్పటి నుంచి కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఫుల్‌గా కథ రెడీ అయ్యిందో షూటింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. కథపరంగా స్ట్రాంగ్‌గా ఉంటుంది.. ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలా కష్టపడ్డారు. పదేళ్లుగా నేను కనిపించకపోయినా మీడియా నన్ను ప్రమోట్ చేస్తూనే వచ్చిందని నవీన్ పేర్కొన్నారు.
నా పక్కన నటించిన హీరోయిన్ రాశీ చాలా మంచి నటి. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్. టైంకి రావడం, ప్రిపేర్ అవ్వడం అలాగే ఆమె మల్టీ టాలెంటెడ్. చాలా బిజినెస్‌లు అవి కూడా చేస్తోంది. ఈ పిల్ల ఇలా చేస్తోందని నేను కూడా ఆశ్చర్యపోయా. ఓవరాల్‌గా ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు స్ట్రాంగ్ కంటెంట్‌తో మీ ముందుకు వస్తోంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.. పదేళ్లుగా నన్ను గుర్తుపెట్టుకున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ వడ్డే నవీన్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications



