ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు.. నందమూరి హీరోలు ప్రచారానికి ఎందుకు దూరం?
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మరోసారి అధికారాన్ని అందుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో వుంది. అటు జగన్‌ను ఒంటరిగా ఓడించలేమంటూ టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా బరిలో నిలిచాయి. ఇరు వర్గాలు బలమైన అభ్యర్ధులను పోటీకి పెట్టి.. వారి తరపున ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వైసీపీ తరపున సీఎం వైఎస్ జగన్ స్టార్ క్యాంపెయినర్‌గా అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తున్నారు. 99 శాతం హామీలు అమలు చేశానని, తాను చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటు వేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరుతున్నారు.
కూటమి విషయానికి వస్తే .. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, జనసేనల పార్టీలు సినీ గ్లామర్ నుంచి వచ్చినవే. దీంతో చిత్ర పరిశ్రమ నుంచి ఆ రెండు పార్టీలకు మద్ధతు వుంటుంది. జనసేన తరపున పవన్ కళ్యాణ్ సోదరుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రచారం చేస్తున్నారు.

నిన్న గాక మొన్న మెగాస్టార్ చిరంజీవి జనసేనకు రూ.5 కోట్లు విరాళంతో పాటు కూటమి అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కూడా. అలాగే హైపర్ ఆది, గెటప్ శ్రీను, జానీ మాస్టర్, సాగర్ తదితరులు పవన్ కోసం శ్రమిస్తున్నారు. ఇవాళ్టీ నుంచి మెగా హీరో వరుణ్ తేజ్ కూడా బాబాయ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ప్రచారంలోకి దిగారు. రేపో మాపో రాంచరణ్, అల్లు అర్జున్, సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక వంటి వారు నేరుగా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ ప్రచారం చేసే ఛాన్సులు లేకపోలేదు.
ఇక టీడీపీ విషయానికి వస్తే.. అన్న ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ నందమూరి ఫ్యామిలీదే. కానీ ఈసారి ఎన్నికలకు పెద్దాయన ఫ్యామిలీ నుంచి ప్రచారానికి ఎవరూ వస్తున్న వార్తలు రావడం లేదు. బాలయ్య మాత్రం హిందూపురం నుంచి మూడోసారి పోటీ చేస్తుండటంతో పాటు కూటమి అభ్యర్ధుల తరపున బస్సు యాత్ర చేస్తున్నారు. బాలయ్య సతీమణి వసుంధర, బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి, చిన్న కుమార్తె తేజస్వినిలు కూడా వారి భర్తల తరపున ప్రచారం చేస్తున్నారు. కానీ మిగిలిన కుటుంబసభ్యుల మాట అస్సలు వినిపించడం లేదు. ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్‌లు మౌనంగా వుండటం సినీ , రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్నికలు వున్నా, లేకున్నా ఏపీ రాజకీయాల్లో తరచుగా జూనియర్ ఎన్టీఆర్ అంశం ప్రస్తావనకు వస్తూనే వుంటుంది. వైసీపీలోని కొందరు ఎన్టీఆర్ సన్నిహితులు, అభిమానులు ఆయన ఫ్లెక్సీలు , బ్యానర్లు ప్రదర్శిస్తూ వుంటారు. టీడీపీ వాళ్లు కూడా ఎన్టీఆర్ మావాడేనంటూ నినాదాలు చేస్తూ వుంటారు. అలాంటిది ఎన్నికల సీజన్‌లో పార్టీకి జీవన్మరణ సమస్యగా వున్న వేళ ఎన్టీఆర్ రంగంలోకి దిగకపోవడం హార్డ్ కోర్ తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

చంద్రబాబు, నారా లోకేష్‌లతో వచ్చిన గ్యాప్.. కుటుంబ సభ్యులు ముఖ్యంగా బాలకృష్ణ తనను దూరం పెట్టడాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కుటుంబపరంగా మనస్పర్థలు ఎలా వున్నా టీడీపీకి సహాయం చేయాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ సైతం సీరియస్‌గా స్పందించారు. తామిద్దరం ప్రస్తుతానికి రాజకీయాలకు దూరమని, మద్ధతు విషయం కుటుంబంతో చర్చించాక తీసుకుంటామని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











