రాజకీయాల్లోకి నటి ఆమని.. ఆ పార్టీలో చేరిక.. తెలంగాణ నుంచి బరిలోకి
భారతదేశంలో సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు రంగాలు ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యేవి కావడం గమనార్హం. రాజకీయ నాయకులను, సినీతారలను ప్రజలు దైవంలా పూజిస్తారు. ఎంతోమంది తెరవేల్పులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్రమంత్రులుగా రాణించారు. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట సినీనటులు రాజకీయాల్లోకి వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తమిళనాట సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న విజయ్ దళపతి.. పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ హీరోయిన్ ఆమని రాజకీయాల్లోకి దిగారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఒకప్పుడు తెలుగుతోపాటు దక్షిణాది ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్లలో ఆమని ఒకరు. గ్లామర్ రోల్స్‌కు దూరంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో హోమ్లీగా కనిపిస్తూ మిడిల్ క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు ఆమని. సౌందర్య, రోజా, రమ్యకృష్ణ, మీనా వంటి స్టార్ హీరోయిన్లు ఇండస్ట్రీని దున్నేస్తున్న దశలో ఎంట్రీ తనమార్క్ చూపించారు ఆమని. కుటుంబ కథా చిత్రాలంటే ఏ దర్శకుడికైనా ముందుగా గుర్తొచ్చే పేరు ఆమని అన్నట్లుగా ఆమె నటన ఉండేది.

జంబలకిడి పంబ, మిస్టర్ పెళ్లాం, కన్నయ్య కిట్టయ్య, అమ్మ దొంగ, ఘరానా బుల్లోడు, సిసింద్రీ, శుభ సంకల్పం, వంశానికొక్కడు, మావిచిగురు, శుభలగ్నం తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో తమిళ నిర్మాత ఖాజా మోహియుద్దీన్‌ని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు. మనస్పర్థల కారణంగా ఆమని కొన్నాళ్లకే తన భర్తతో విడిపోయారు. పెళ్లి పిల్లలతో మధ్యలో గ్యాప్ తీసుకున్న ఆమని.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తల్లి, వదిన వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. స్వామి, ఆ నలుగురు, చందమామ కథలు, భరత్ అనే నేను తదితర సినిమాలలో నటించారు.
ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపై సీరియల్స్, ప్రత్యేక కార్యక్రమాలలో సందడి చేస్తూ బిజీగా గడుపుతున్నారు ఆమని. ఇటీవల వరుస ఇంటర్వ్యూలతో హల్‌చల్ చేస్తూ ఇండస్ట్రీలోని పరిణామాలను, చీకటి కోణాలను బయటపెడుతున్నారు. ప్రత్యేకించి చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్.. తాను కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమని చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
అయితే అనూహ్యంగా ఆమని రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని, ఫలానా పార్టీలో చేరబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ ఊహాగానాలను నిజం చేస్తూ షాకిచ్చారు ఆమని. భారతీయ జనతా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు ఈ సీనియర్ నటి. డిసెంబర్ 20వ తేదీన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆమని బీజేపీలో చేరారు. ఆమె వెంట మేకప్ ఆర్టిస్ట్ శోభలత కూడా కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమని మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న మంచి పనులను అందరం చూస్తున్నాం. బయటి దేశాలకు వెళితే మమ్మల్ని ఇండియన్స్ అని అందరూ గుర్తిస్తున్నారంటే మోడీ గారి వల్లే. ఆయన స్పూర్తితో ఎన్నో మంచి పనులు చేయాలని బీజేపీలో జాయిన్ అయ్యాను అని ఆమని తెలిపారు. దీంతో ఆమె రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో యాక్టీవ్ అవుతారా? ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలుస్తారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











