సినిమా ఆఫరిస్తే.. మాకు ఏమిస్తావు.. ఇండస్ట్రీలో చేదు అనుభవాలపై అనన్య నాగళ్ల
సినీ వినీలాకాశంలో వెలిగిపోవాలని కొండంత ఆశలతో ఇండస్ట్రీ వైపు వచ్చే అమ్మాయిలు కొందరు కామాంధుల చేతికి చిక్కి బలైపోతున్నారు. అదే క్యాస్టింగ్ కౌచ్. సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవాలంటే ఆడపిల్లలు కమిట్‌మెంట్‌కు సిద్ధం కావాల్సిందేనని ఎంతోమంది మహిళా నటుడు మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో వెలుగుచూసిన జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ కలకలం రేపింది.
గతంలో మీ టూ ఉద్యమం సాగినంత కాలం.. రోజుకొక ప్రముఖుడి గురించి ఆరోపణలు వినిపించేవి. స్టార్స్ చెప్పినట్లు చేయకుంటే తొక్కేస్తారని, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా వారిని సంతృప్తిపరచాల్సిందేనని ఎంతోమంది మహిళా నటులు ఆరోపించారు. రాను రాను ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు పెరగడంతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్ధితి నెలకొంది. కానీ క్యాస్టింగ్ కౌచ్ కారణంగా సినీరంగంలో వెలిగిపోవాలని వచ్చిన ఎంతోమంది అమ్మాయిలు బలైపోయారు.

ఇకపోతే.. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు అంతంత మాత్రమే. అలా టాలీవుడ్‌లో ఛాన్స్ దక్కించుకున్న అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. గుడ్ లుక్స్, యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకుంది. మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనన్న.. తొలి సినిమాకే సైమా అవార్డ్‌కు నామినేట్ అయ్యింది. ఆ తర్వాత వకీల్ సాబ్‌తో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ వెంటనే మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, మళ్లి పెళ్లి, అన్వేషి, తంత్ర, డార్లింగ్ సినిమాలతో దూసుకొచ్చింది.
గతేడాది అనన్య నటించిన పోట్టెల్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సాహిత్ మోతుకూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఓ జర్నలిస్ట్.. క్యాస్టింగ్ కౌచ్ గురించి అనన్యను అడిగింది. ఈ వ్యవహారం చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య నాగళ్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆడిషన్స్ చేస్తున్న టైం నుంచే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై మానసికంగా ఓ బలం వస్తుందని అనన్య చెప్పారు. మనకంటూ ఏదో ఒకటి రాసి పెట్టి ఉంటుందని అనుకుంటూ జర్నీని స్టార్ట్ చేస్తామని .. ఇంతలో కొంతమంది వచ్చి నీకు ఇండస్ట్రీలో ఆఫర్లు కావాలా అని అడుతారని తెలిపారు. డైరెక్ట్‌గా కమిట్మెంట్ గురించి చెప్పకుండా ఆ హీరోయిన్ ఇలా చేసింది అని చెబుతారని అనన్య వెల్లడించారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఇవన్నీ అవసరం అనేలా పరిస్ధితులు క్రియేట్ చేస్తారని ఆమె పేర్కొన్నారు.

నువ్వు బురదలో ఉండి నీకు బురద అంటదు అంటే ఎవరూ నమ్మరని.. కాబట్టి వాళ్లు వెళ్లిన దారిలో వెళ్తే నీకేం కాదని మనల్ని ఒప్పించడానికి ట్రై చేస్తారని ఆమె తెలిపారు. మల్లేశం సినిమాలో నా యాక్టింగ్, డ్రెస్ సెన్స్ వల్ల ఎవరూ నాతో డైరెక్ట్‌గా వచ్చి కమిట్‌మెంట్ గురించి మాట్లాడలేదని అనన్య గుర్తు చేసుకున్నారు. అయితే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలనేది జర్నీలో అర్ధమైపోతుందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం అనన్య నాగళ్ల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమెను కమిట్‌మెంట్ గురించి అడిగింది ఎవరు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











