Balakrishna: ట్రోల్స్‌కు అంజలికి దిమ్మతిరిగే జవాబు.. బాలకృష్ణపై ట్వీట్ వైరల్!
ఇటీవల యంగ్ హీరో విశ్వక్‌సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ''గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి '' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌లో వేదికపైకి వచ్చిన తర్వాత సినీనటి అంజలిని బాలయ్య నెట్టివేయడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. బాలయ్య తీరుపై నెటిజన్లు, పలువురు ప్రముఖులు మండిపడుతున్నారు. చిత్ర యూనిట్ అసలు ఏం జరిగిందో చెప్పినా వివాదానికి తెరపడటం లేదు, ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ ఆగడం లేదు.
యూనిట్‌తో కలిసి బాలయ్య ఫోటోలకు పోజులు ఇచ్చే క్రమంలో అంజలిని పక్కకు జరగమన్నారు. అయితే ఆమె సరిగా వినిపించుకోలేదు, దీంతో బాలయ్యను ఆమెను పక్కకు నెట్టారు.. తొలుత అంజలి షాక్ అయినా, తర్వాత ఆ విషయాన్ని సరదాగా తీసుకుని నవ్వుతో కవర్ చేసింది. ఆ వెంటనే బాలకృష్ణకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది.

వివాదం ముదురుతూ ఉండటంతో హీరో విశ్వక్‌సేన్ , నిర్మాత సూర్యదేవర నాగవంశీలు స్పందించారు. ఈవెంట్‌లో జరిగింది వేరు, సామాజిక మాధ్యమాల్లో చూపించేది వేరన్నారు. వీడియోను ముందు, వెనుక కట్ చేసి కావాలనే వైరల్ చేస్తున్నారని.. బాలయ్య అందరితో సరదాగా ఉంటారని .. ట్రోలింగ్ ఆపాలని విశ్వక్‌సేన్ సూచించారు.
అంతేకాదు.. ఈ ఈవెంట్‌కు బాలయ్య మందు తాగి వచ్చారని, ఆయన సీటు పక్కన మద్యం బాటిల్‌ను హైలైట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మద్యం బాటిల్ నిజం కాదని.. మంచినీటి సీసాలో మందు ఉన్నట్లు సీజీ చేసి బాలకృష్ణను ట్రోల్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా ఈ ఈవెంట్‌లో ఉన్నామని.. అక్కడేం జరిగిందో మాకు తెలియదా అని నాగవంశీ ప్రశ్నించారు.

నలుగురు వ్యక్తులు ఒకే చోటికి చేరినప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా చేయడం సహజమని.. ఫోటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని అంజలిపై ఉన్న చనువుకొద్దీ బాలకృష్ణ అలా చేశారని నాగవంశీ తెలిపారు. ఆ తర్వాత బాలయ్య - అంజలిలు హైఫై అంటూ చేతులు కలిపిన దృశ్యాన్ని ఎందుకు చూపించలేదని ఆయన నిలదీశారు.
ఈ నేపథ్యంలో హీరోయిన్ అంజలి ఈ వివాదంపై స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె.. బాలయ్య రావడం వల్ల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగిందన్నారు. బాలకృష్ణ అంటే తనకు ఎంతో గౌరవమని, తనతో అప్యాయంగా ఉంటారని అంజలి చెప్పారు. తామిద్దరం ఎన్నో ఏళ్లుగా స్నేహింగా ఉంటున్నామని, బాలయ్యతో కలిసి వేదికను పంచుకోవడం ఆనందంగా ఉందని అంజలి ట్వీట్‌లో పేర్కొన్నారు.
అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్‌లో వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని మూమెంట్స్‌ను ఆమె షేర్ చేశారు. మరి అంజలి క్లారిటీతోనైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేక కంటిన్యూ అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్‌సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించారు. నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది, మధునందన్, ప్రవీణ్, గోపరాజు రమణ, తదితరులు కీలకపాత్రలు పోషించగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











