లేత వయసులో తెలియకుండా ఆ తప్పు చేశా.. హీరోయిన్ లయ
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు ప్రతీకగా నిలిచిన ఈ తెలుగమ్మాయి, తన సహజ నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 1990 - 2000 మధ్య కాలంలో లయ టాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందింది. గ్లామర్ పాత్రల కంటే కథకు ప్రాధాన్యం ఉన్న, కుటుంబ విలువలను ప్రతిబింబించే పాత్రలను ఎంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్న వయసులో తీసుకున్న ఆ నిర్ణయాలే ఇప్పుడు బాధిస్తున్నాయని లయ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది?
హీరోయిన్ లయ సినీ ప్రయాణం బాలనటిగా ప్రారంభమైంది.'భద్రం కొడుకో' సినిమాతో చిన్నపాత్రలో తెరపై కనిపించిన ఆమె, తర్వాత హీరోయిన్‌గా 'స్వయంవరం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా విజయం ఆమె కెరీర్‌కు మైల్ స్టోన్ గా మారింది. అనంతరం ప్రేమించు, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, శివరామరాజు, అదిరిందయ్యా చంద్రం వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా కథ ప్రాధాన్యం నటించింది. ఈ క్రమంలోనే ఆమె దాదాపు 50కి పైగా తెలుగు చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఇలా కెరీర్ పీక్స్ దశలో ఉన్న సమయంలో లయ వివాహం చేసుకుని, సినిమాలకు కొంతకాలం విరామం తీసుకుంది. అనంతరం ఆమె అమెరికాలో స్థిరపడి కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లింది. కొన్నేళ్ల తరువాత రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. తరువాత నితిన్ 'తమ్ముడు'సినిమాతో లయ పూర్తి స్థాయిలో రీ-ఎంట్రీ ఇచ్చింది. తాజాగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విలక్షణ నటుడు శివాజీతో కలిసి లయ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ లయ బిజీబిజీగా మారింది.
ఇటీవల యాంకర్ వర్ష హోస్ట్‌గా నిర్వహిస్తున్న 'కిస్సిక్ టాక్స్' కార్యక్రమంలో పాల్గొన్న లయ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో కొన్ని ఫన్నీ మోమెంట్స్‌తో పాటు ఎమోషనల్ విషయాలు కూడా బయటపెట్టారు. కార్యక్రమంలో భాగంగా యాంకర్ వర్ష సరదాగా మాట్లాడుతూ.. 'మమ్మల్ని బాధపెట్టి అమెరికాకు ఎందుకు వెళ్లిపోయారు?''అని ప్రశ్నించారు.
దీనికి లయ నవ్వుతూ స్పందిస్తూ.. "మా ఆయన అక్కడే ఉంటారు కదా.. అందుకే వెళ్లాల్సి వచ్చింది" అని చెప్పారు. దీనిపై వర్ష మళ్లీ సరదాగా 'మీకు పెళ్లయిందా?' అని అడగడంతో స్టూడియోలో నవ్వులు పూశాయి. అనంతరం వర్ష, 'మీరు తెలుగు ఇండస్ట్రీని, తెలుగు ప్రేక్షకులను వదిలి వెళ్లనని మాట ఇవ్వాలి'అని లయతో ప్రామిస్ చేయించుకుంది. దీనికి లయ కూడా చమత్కారంగా స్పందించింది. 'తెలుగు ప్రేక్షకులను నేను ఎప్పుడూ వదిలి వెళ్లను. కానీ నా ఫ్యామిలీ అమెరికాలో ఉంది కాబట్టి వాళ్లను చూసుకోవడానికి అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తాను' అని చెప్పింది.
ఈ ఇంటర్య్వూలో లయ తన కెరీర్ ప్రారంభ దశలో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి మాట్లాడింది. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే తాను చేసిన కొన్ని పాత్రలు తర్వాత కెరీర్‌పై ప్రభావం చూపాయని ఆమె వెల్లడించింది. ముఖ్యంగా 'ప్రేమించు' సినిమాలో చేసిన బ్లైండ్ క్యారెక్టర్ గురించి వర్ష ప్రశ్నించింది. 'అప్పుడు మీరు టాప్‌లో ఉన్న సమయంలో అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారు? ఆ రిస్క్ తీసుకున్న రహస్యం ఏమిటి?'అని అడిగింది.
దీనికి లయ సమాధానమిస్తూ 'ఆ సమయంలో నాకు సరైన మార్గదర్శనం చేసే వాళ్లు ఎవరూ లేరు. నా వయసు కూడా చాలా చిన్నది.. అప్పుడు 18-19 ఏళ్లే. ఒక కమర్షియల్ హీరోయిన్‌గా ఎదగాలని అనుకునే సమయంలోనే నేను ఆర్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టాను. అప్పట్లో కొందరు 'ఇలా ఎందుకు చేస్తున్నారు?' అని అడిగేవారు. కానీ వారు ఎందుకు అలా అంటున్నారో కూడా నాకు అర్థం కాలేదు'అని చెప్పింది.
'వాస్తవానికి ఆ సమయంలో నాకు కెరీర్ ప్లానింగ్ గురించి పెద్దగా అవగాహన లేదు. ఒక సినిమా పాత్ర భవిష్యత్తులో వచ్చే అవకాశాలపై ఎలా ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోలేకపోయాను. ఆ సమయంలో చేసిన కొన్ని సినిమాల వల్ల తరువాత వచ్చే కమర్షియల్ అవకాశాలపై ప్రభావం పడిందని ఇప్పుడు అనిపిస్తోంది' అంటూ లయ ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్‌లో కొన్ని మంచి అవకాశాలు మిస్ అయ్యాయని కూడా ఆమె పేర్కొన్నారు. చిన్న వయసులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తర్వాత ఎలా ప్రభావం చూపుతాయో అప్పట్లో గ్రహించలేకపోయానని ఆమె తెలిపింది.


Click it and Unblock the Notifications











