‘‘ హీరోయిన్లది కుక్క బతుకే .. నడుము ముట్టొచ్చా, బట్టలిప్పి చూపించమంటూ ’’
చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళా నటుల పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో వివరించింది. ఈ నివేదిక తర్వాత పలువురు హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఒక్క మలయాళంలోనే కాదూ టాలీవుడ్, కోలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల్లోనూ హేమ కమిటీ తరహా ప్రత్యేక కమీషన్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాధవీ లత ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హేమ కమిటీ నివేదిక తర్వాత స్టార్ హీరోయిన్ సమంత వంటి వారు టాలీవుడ్‌లో అలాంటి కమీషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 2019లో నియమించిన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీ గ్రేడ్ సినిమాల్లో నటించిన షకీలా కూడా అన్ని ఇండస్ట్రీల్లోనూ కమీషన్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో చెన్నైలో నడిగర్ సంఘం సమావేశం జరిగింది. ఈ భేటీకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ మీటింగ్‌లో పాల్గొన్న సీనియర్ నటి రోహిణి మాట్లాడుతూ.. లైంగిక వేధింపులు గురించి సినీ ప్రముఖులు మీడియా ముందుకు రావొద్దన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు రోహిణి. జస్టిస్ హేమ కమిటీ మాదిరిగానే కోలీవుడ్‌లోనూ ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల తమిళ స్టార్ హీరో విశాల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో నడిగర్ సంఘం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదిలాఉండగా.. 2008లో నచ్చావులే సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మాధవీలత ఫస్ట్ మూవీతోనే మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ వెంటనే స్నేహితుడా, ష్, ఉసురు, అరవింద్ 2, తొలిపాట వంటి సినిమాలు చేసినా లక్ కలిసి రాలేదు. మధ్యలో తమిళంలోకి వెళ్లి తన అదృష్టం పరీక్షించుకోగా.. అక్కడా సేమ్ రిజల్ట్. సినిమాలలో అవకాశాలు రాకపోవడం, ఇతరత్రా కారణాలతో మాధవీలత కృష్ణ భక్తురాలిగా మారిపోయారు. అయితే అడపాదడపా ఇంటర్వ్యూలు ఇస్తూ అందులో సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.
కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌తో మాట్లాడిన మాధవీలత.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ , లైంగిక వేధింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో కో ఆర్డినేటర్‌ల వద్ద అమ్మాయిలది కుక్క బతుకేనని , రూ.500 కోసం వాళ్లు ఎంతో కష్టపడతారని ఆమె తెలిపారు. జూనియర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు అందరూ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మాధవీలత చెప్పింది. ఈ మధ్యకాలంలో కొంతమంది అమ్మాయిలు విపరీతంగా ఎక్స్‌పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీని వల్ల ఎవరికీ , కనీసం ఆ అమ్మాయిలకు కూడా యూజ్ ఉండదని .. ఫ్రాంక్స్ చేసేవాళ్లు, రోడ్ల మీద తిరిగేవాళ్లకే ఇవి పనికొస్తాయని మాధవీలత చెప్పారు. అలాంటి రీల్స్ చేస్తే బట్టలిప్పి చూపించు.. నీ నడుము ముట్టుకోవచ్చా అని అడుగుతారు తప్పించి సినిమాల్లో ఎలాంటి ఛాన్స్‌లు దక్కవని మాధవీలత చాలా ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











