కష్టాల్లో హీరోయిన్ నుస్రత్ జహాన్.. ఎంపీ సీటుకు ఎసరు?.. భర్తను వదిలేయడంతో...
బెంగాలీ హీరోయిన్, తృణమూల్ కాంగ్రెస్ యువ ఎంపీ నుస్రత్ జహాన్ రూహీకి కష్టాల్లో పడినట్టు కనిపిస్తున్నది. తాను వివాహితను అని పార్లమెంట్‌కు అఫిడవిట్ దాఖలు చేసి తప్పుడు సమాచారం ఇచ్చిందనే ఫిర్యాదు నమోదైంది. నుస్రత్ జహాన్‌ను టార్గెట్‌గా చేసుకొని బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం ఆమెను ఇబ్బందుల్లో పడేసినట్టు కనిపిస్తున్నది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే...

2019లో బసిర్హత్ నియోజకవర్గం నుంచి
యువ హీరోయిన్‌గా తనదైన శైలిలో రాణిస్తున్న నుస్రత్ జహాన్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఎన్నికైన కొద్ది రోజులకే నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను టర్కీలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలో వివాహం చేసుకొన్నారు. టర్కీ వివాహ చట్టాలను అనుసరించి నుప్రత్ వివాహం చేసుకొన్నారు.

పెళ్లైన కొద్ది రోజులకే భార్తతో విడిపోయి..
అయితే వివాహం జరిగిన కొద్ది నెలల తర్వాత నుస్రత్, నిఖిల్ మధ్య అభిప్రాయపబేధాలు తలెత్తడంతో వారిద్దరూ విడిపోయారు. అయితే తమ వివాహం భారత్‌లో జరిగిన మతాంతర వివాహం కాదు. అందుకే మా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరుగలేదు. విదేశాల్లో జరిగిన వివాహం కాబట్టి మేము విడాకులు తీసుకోనవసరం లేదు. మాది మ్యారేజ్ కంటే లివింగ్ రిలేషన్‌షిప్ మాదిరి బంధం అని నుస్రత్ జహాన్ వెల్లడించారు.

పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం సందర్భంగా
నుస్రత్ జహాన్ వివాహం చేసుకొన్న సమయంలోనే పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. జూన్ 25, 2019 రోజున ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ సందర్భంగా ఆమె తాను వివాహితురాలిని. నా పేరు నుస్రత్ జహాన్ రూహి జైన్ అని చెప్పారు. నుదుట కుంకుమ పెట్టుకొని కనిపించారు అంటూ ఎంపీ సంఘమిత్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

లోక్‌సభను తప్పుదోవ పట్టించారని...
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో ఎంపీ సంఘమిత్ర లేఖ రాస్తూ.. తన వైవాహిక సంబంధం విషయంలో లోక్‌సభకు తప్పుడు సమాచారం ఇచ్చారు. తన పెళ్లికి సంబంధించిన విషయంలో ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోవపట్టించారు. ఇలాంటి చర్యలు అనైతికం. తప్పుడు సమాచారం ఇచ్చి పార్లమెంట్ ప్రతిష్టను మంటగలిపారు అంటూ సంఘమిత్ర మౌర్య తన లేఖలో ఘాటుగా స్పందించారు. ఆమెపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మాకు ఫిర్యాదు అందలేదని...
అయితే నుస్రత్ జహాన్‌పై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారని మీడియా ఆరా తీయగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఈ వ్యవహారం మా దృష్టికి ఎవరూ తీసుకురాలేదు. కాబట్టి మేము ఇంకా ఈ విషయంపై స్పందించలేం అని పార్లమెంట్ వ్యవహారాల అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీ సంఘమిత్ర మౌర్య స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











