ఇంట్లో ఉంటే బతుకుతావు.. లేదంటే పైకే.. పాయల్ రాజ్‌పుత్ ఫైర్
కరోనావైరస్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులతో సగటు పౌరుడి నుంచి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా చైన్‌ను తెంచడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనాను నివారించేందుకు కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న పాయల్ రాజ్‌పుత్ తాజాగా హలో యాప్‌లో లైవ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకొన్నారు..

ఇంట్లో ఉండటం కష్టమే
ప్రపంచాన్ని కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. ప్రధాని మోదీ ప్రజలను ఇంట్లోనే ఉండాలని కోరారు. జనతా కర్ఫ్యూ పాటించాం. ప్రతీ ఒక్కరు ఇంట్లోనే ఉంటూ దేశానికి సేవ చేస్తున్నారు. ఇంట్లో ఉండటం చాలా కష్టమైన పనే. కానీ ప్రజలు దేశ బాగోగుల కోసం భరిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు దేశానికి అండగా నిలబడటం హ్యాట్సాఫ్ అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు.

కుటుంబంతో కలిసి ఉండే భాగ్యం
స్వీయ గృహ నిర్బంధం మనకు కలిసి వచ్చిన మంచి అవకాశం. ఇంటి పట్టునే కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి అవకాశం దక్కింది. మానసికంగా, శారీరకంగా ధృడంగా మారేందుకు ఛాన్స్ లభించింది. నేను ఉదయం ఆలస్యంగా లేస్తాను. ఎందుకంటే రాత్రి లేటుగా నిద్రపోతాను. కాబట్టి 11 గంటలకు లేచి యోగా చేస్తాను. ఆ తర్వాత భోజనం చేసి.. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాను అని పాయల్ రాజ్‌పుత్ పేర్కొన్నారు.

ముంబైలోనే ఉంటూ..
కరోనా కారణంగా అమలవుతున్న లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం అయ్యాను. ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నాను. ఢిల్లీ నుంచి ఈ మధ్యనే ముంబైకి మకాం మార్చాను. ప్రస్తుతం ముంబై ఇంటిలోనే ఉంటూ సినిమాలు చూస్తున్నాను. నెటిఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వెబ్ సిరీస్ చూస్తున్నాను అని పాయల్ రాజ్‌పుత్ చెప్పారు.
Recommended Video

అభిమానికి క్లాస్ పీకిన పాయల్
కరోనా సమయంలో బయట తిరుగుతున్నానని చెప్పిన అభిమానికి క్లాస్ పీకారు. ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బయట తిరుగుతున్నావా? ఇంట్లో ఉండకపోతే బతికి బట్టకట్టడం కష్టం. నీ కోసం, దేశం కోసం, నీ ఫ్యామిలీ కోసం, మా కోసం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాను అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు.


Click it and Unblock the Notifications











