HBD Pooja Hegde : చేతిలో రెండే ప్రాజెక్ట్స్ , బుట్టబొమ్మ ఆదాయం తగ్గిందా? పూజా హెగ్డే సంపద ఎన్ని కోట్లంటే?
ఇండస్ట్రీకి వచ్చిన షార్ట్ గ్యాప్‌లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకున్నారు పూజా హెగ్డే. ఏకంగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టింది. సౌత్‌లో దక్కిన స్టార్ డమ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడా మంచి విజయాలను అందుకుంది. నేడు ఈ బుట్టబొమ్మ పుట్టినరోజు . ఈ సందర్భంగా పూజా హెగ్డే ఆస్తులు, పారితోషికం, వ్యక్తిగత వివరాలను తెలుసుకుందాం.
1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించారు పూజా హెగ్డే. తల్లిదండ్రులు కన్నడిగులు. ఇంట్లో అంతా ఉన్నత విద్యావంతులు కావడంతో ఆమె కూడా చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అయితే 19 ఏళ్ల వయసులో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. కానీ ఎక్కడా కృంగిపోకుండా ఆ మరుసటి ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా కాంటెస్ట్‌లో రన్నరప్‌గా కిరీటం అందుకున్నారు. ఈ విజయంతో మోడలింగ్‌లో అడుగుపెట్టిన పూజ.. ఫేమస్ బ్రాండ్స్‌కు అండార్స్ చేశారు.

అనూహ్యంగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పూజాహెగ్డే.. తమిళంలో ముగామూడీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఒక లైలా కోసం మూవీతో తెలుగు వారిని పలకరించిన ఆమె ఇండస్ట్రీలో సెటిలవ్వాలని నిర్ణయించుకున్నారు. వరుణ్ తేజ్‌తో ముకుందలో నటించిన పూజా హెగ్డేకు ఆ వెంటనే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ సరసన మొహంజదారోలో నటించే అవకాశం ఉంది. ఇక నాటి నుంచి ఆమె వెనుదిరిగి చూసే అవకాశం రాలేదు. డీజే, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వంటి హిట్ సినిమాలదో దూసుకెళ్లారు.
కానీ ఎందుకో తెలియదు కానీ గత కొంతకాలంగా పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసికా భాయ్ కిసి కి జాన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా అలరించలేదు. ఆమెకు హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన తెలుగులో పూజా హెగ్డేకు ప్రస్తుతం ఏ ఆఫర్లు దొరకడం లేదు, కొత్తగా ఆమెను సంప్రదించిన వారు కూడా లేరని ఫిలింనగర్ టాక్. హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా, తమిళ్‌లో సూర్య 44వ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇళయ దళపతి విజయ్ సినీ జీవితంలో ఆఖరి చిత్రంగా భావిస్తున్న దళపతి 69లో ఆమె హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేశారు.

కాగా.. ఇన్నేళ్ల కెరీర్‌లో పూజా హెగ్డే బాగానే ఆస్తుల్ని సంపాదించినట్లు ఫిలింనగర్ టాక్. ఒక్కో సినిమాకు రూ. 2 నుంచి రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే పూజకు హైదరాబాద్, ముంబై, మంగళూరు, బెంగళూరులలో కోట్లాది రూపాయలు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే రూ.2 కోట్ల విలువైన పోర్షే కారు, కోటి ఖరీదు చేసే జాగ్వార్, ఆడీ క్యూ7 , బీఎండబ్ల్యూ 350డీ, ఇన్నోవా క్రిస్టా వంటి కార్లు పూజ గ్యారేజీలో ఉన్నాయి.
తల్లిదండ్రులు బిజినెస్ పర్సన్స్ కావడంతో వారి నుంచి నేర్చుకున్న మెళకువులతో పూజా హెగ్డే తన సంపాదనను పలు వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడుతోందని ఫిలింనగర్ టాక్. మొత్తంగా పూజా హెగ్డే ఆస్తులు దాదాపు రూ.85 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఆమె మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.


Click it and Unblock the Notifications











