శ్రీవారి లడ్డూలలో పంది కొవ్వా .. కలలోనూ ఊహించలేం, పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ తయారుచేసిన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా వార్తలు రావడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) అనుమానం వ్యక్తం చేసింది. ఈ వార్త బయటికొచ్చిన నాటి నుంచి శ్రీవారి భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలుగు సినీ నటి ఈ ఇష్యూపై స్పందించారు.
శ్రీవారి లడ్డూలలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, పాల నుంచి వచ్చిన నెయ్యి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలిసినట్లు ఆ పరీక్షలో వెల్లడైందని ఎన్‌డీడీబీ పేర్కొంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపై హిందూ సంఘాలు, సాంప్రదాయవాదులు భగ్గుమంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సైతం నలుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించి విచారణకు ఆదేశించింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా లడ్డూల ఇష్యూపై స్పందించారు. ట్విట్టర్‌లో ఓ హిందూ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ధార్మిక పద్ధతులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.
కాగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హీరోయిన్ ప్రణీత సుభాష్ సమకాలీన అంశాలపై స్పందిస్తుంటారు. మొన్నామధ్య కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా దక్షిణాది వారిపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. రెండోసారి గర్బం దాల్చిన ప్రణీత.. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లలు, భర్తను చూసుకుంటూ హాయిగా గడిపేస్తున్నా సోషల్ మీడియాను మాత్రం వదిలిపెట్టడం లేదు. తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలు తెలుసుకున్న ప్రణీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఇలాంటి వార్తలు రావడం దారుణం. నిజంగానే లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనే వంటివి కలిపి కల్తీ చేసినట్లు తేలితే.. దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రణీత డిమాండ్ చేశారు. అసలు ఇలాంటి ఘటనలు జరుగుతాయని కలలోనూ ఊహించలేమని, కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఈ వార్తలతో కలత చెందారని ప్రణీత పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఎక్స్‌లో పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











