ఆ హీరోలతో అలా రిలేషన్ అంటగట్టేవారు, ఇక పెళ్లి చేసేసుకుంటా: స్టార్ హీరోయిన్ ఎమోషనల్
సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల్లో ఏది అసలో, ఏది నకిలీయో తెలియడం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల సమాజంలో ప్రముఖుల పరువు ప్రతిష్టలు మంటగలిసిపోతున్నాయి. వారు బాధపడుతుంటే కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా, ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వీరి ఆగడాలు ఆగటం లేదు. ఎక్కువగా సినీ పరిశ్రమకు చెందిన వారు సోషల్ మీడియా బాధితులుగా మారిపోతున్నారు.
వ్యూస్, డబ్బుల కోసం ఫలానా హీరో, ఫలానా హీరోయిన్‌తో తిరుగుతున్నాడంటూ లేనిపోని సంబంధాలు అంటగట్టేస్తూ దిగజారిపోతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాలలో పెట్టే థంబ్‌నైల్స్ చూస్తే లోపల మేటర్ లేకున్నా.. ఏదో ఉంది అనిపించేలా హెడ్డింగ్స్ పెట్టి జనాలను ఆకర్షిస్తుంటారు. నటీనటుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోయి ఉన్నవీ లేనివీ కల్పించి రాస్తున్నారు. పనిగట్టుకుని స్టార్స్‌పై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాలపై ఇటీవల మా అసోసియేషన్ కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని ఛానెల్స్‌పై చర్యలు తీసుకుంటామని మా ప్రతినిధులు చెబుతున్నారు.

తాను కూడా అలాంటి బాధితురాలినే అంటున్నారు చెన్నై చిన్నది ప్రియా భవానీ శంకర్. న్యూస్ రీడర్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన ప్రియ.. తర్వాత బుల్లితెరపై సీరియల్స్‌లో హల్‌చల్ చేశారు. ఈ పాపులారిటీతో సినిమాల్లో ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి. మేయాద మాన్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ప్రియ వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీలు తెలుగులోకి డబ్ కావడంతో ఇక్కడి వారికి కూడా ప్రియ దగ్గరయ్యారు. 2023లో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన కళ్యాణం కమనీయం మూవీతో తెలుగులో తొలిసారి నటించిన ఆమె.. భీమాలోనూ సందడి చేశారు, దూత వెబ్‌సిరీస్‌లో నాగచైతన్యకు భార్యగా నటించారు.
అందరు హీరోయిన్ల మాదిరిగానే ప్రియా భవానీ శంకర్‌పైనా ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో తన బాయ్‌ఫ్రెండ్ రాజ్‌ను , అతనితో తన రిలేషన్‌ను బయటపెట్టింది. దీంతో వీరిద్దరూ విడిపోయినట్లుగా ఎన్నోసార్లు గాసిప్స్ హల్‌చల్ చేశాయి. తాజాగా డెమోంటే కాలనీ -2లో నటిస్తున్న ప్రియ ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన ప్రేమ, కెరీర్, రూమర్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను చాలా మంది స్టార్స్‌తో వర్క్ చేయడంతో .. వారితో సాన్నిహిత్యం ఏర్పడిందని, అందుకే వారి పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర సందర్భాల్లో విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతానని ప్రియా తెలిపారు. అలా పెట్టడమే ఆలస్యం .. వారితో తాను రిలేషన్‌లో ఉన్నట్లుగా రకరకాల న్యూస్ వైరల్ అయ్యేదని , ఇప్పుడు ఆ స్టార్స్‌కి పెళ్లిళ్లు అవ్వడంతో తనకు టెన్షన్ తప్పిందన్నారు. రాజ్- నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే సరైన సమయం దొరకలేదని , వచ్చే ఏడాది ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటామని ప్రియా భవానీ శంకర్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











