vinesh phogats: మేం అండగా ఉన్నాం.. రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు సమంత మద్ధతు
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరి గోల్డ్ మెడల్ సాధిస్తుందని యావత్ భారతదేశం ఆశతో ఎదురుచూస్తున్న వేళ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు, భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. 50 కేజీల విభాగంలో జరగాల్సిన ఫైనల్‌కు ముందు వినేశ్ బరువును చూసిన నిర్వాహకులు నిబంధనలకు మించి 100 గ్రాములు అదనంగా ఉన్నట్లుగా నిర్ధారించారు. దీంతో వినేశ్‌పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రపంచ నెంబర్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీంతో భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఈ నిర్ణయాన్ని సవాల్ చేసింది. మంగళవారం రాత్రి సెమీస్‌లో విజయం సాధించిన వినేశ్.. బుధవారం ఉదయానికే బరువు పెరగడంపైనా ఐవోఏ అనుమానం వ్యక్తం చేసింది.
దీంతో ఒలింపిక్ కమిటీ రూల్స్ ఏం చెబుతున్నాయోనని నెటిజన్లు రూల్స్ బుక్‌ని తిరగేస్తున్నారు. రెజ్లింగ్‌లో 50,53, 57, 62, 68, 76 కేజీల విభాగాలున్నాయి. క్రీడాకారులు ఆయా కేటగిరీ పరిధిలో ఉన్నారని నిర్ధారించేందుకు పోటీ జరిగే రోజు ఉదయం బరువును కొలుస్తారు. దీంతో క్రీడాకారులు తప్పనిసరిగా నిర్ణీత బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వారు ధరించే జెర్సీలతో కలిపి బరువును చూస్తారు. పలు ఆరోగ్య పరీక్షలు చేసి ఎలాంటి అంటువ్యాధులు లేవని చూడటం, చివరికి గోళ్లు కట్ చేసుకున్నారో లేదో కూడా పరిశీలిస్తారు.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వినేశ్ విషయంలో ఏం జరిగిందోనని అభిమానులు ఆరా తీస్తున్నారు. మంగళవారం రాత్రికే వినేశ్ 2 కిలోల అదనపు బరువు ఉందని.. రాత్రంతా నిద్రపోకుండా జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి చాలా వరకు తగ్గించుకున్నారు.. కానీ 100 గ్రాముల వెయిట్ అందరి ఆశలపై నీళ్లు చల్లింది. వినేశ్‌కు మరికొంత సమయం ఇవ్వాలన్న భారత్ అభ్యర్ధనను అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఏమాత్రం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం బరువును నియంత్రించుకునేందుకు వినేశ్ కఠినమైన వర్కవుట్లు చేశారు. జుట్టు కత్తిరించుకోవడం, శరీరం నుంచి కొంత రక్తం కూడా తీయించుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు .. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు ముందు అనర్హత వేటు పడిన వినేశ్ బాధ వర్ణనాతీతం. మానసికంగా కృంగిపోయిన ఆమెకు సహచరులు, కోచ్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అండగా నిలిచాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆమెను ఓదార్చారు. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, భారతీయులందరికీ నువ్వు స్పూర్తిదాయకమని.. ఇవాళ నీకు తగిలిన దెబ్బ నన్ను ఎంతో బాధించిందని.. దీని నుంచి బయటపడి బలంగా తిరిగి వస్తావని ఆకాంక్షిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు. అంతేకాదు.. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో ఆయన స్వయంగా ఫోన్‌లో మాట్లాడి వినేశ్ వ్యవహారంపై ఆరా తీశారు.

అనేకమంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం వినేశ్ ఫొగాట్‌కు అండగా నిలిచారు. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత సైతం ఆమెకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పోరాడే వ్యక్తులైనా అడ్డంకులను ఎదుర్కొంటారు.. మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి, మీ కష్టసుఖాల్లో మేము ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కష్టాలలోనూ నిలబడే మీ ధైర్యం ప్రశంసనీయమని సమంత పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











