Samantha Ruth Prabhu : ప్రతి 16 నిమిషాలకో రేప్.. అత్యాచారాలపై సమంత ఎమోషనల్ పోస్ట్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు స్టార్ హీరోయిన్ సమంత. తన సినిమాలు , వ్యక్తిగత విషయాలతో పాటు సమకాలీన అంశాలపై ఆమె స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళా హక్కులు, భద్రత తదితర విషయాలపై సమంతకు మంచి అవగాహన ఉంది. తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎప్పటికప్పుడు ఈ విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు సామ్. తాజాగా దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై సమంత ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆగస్ట్ 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. నైట్ షిఫ్ట్‌లో ఉన్న యువ డాక్టర్.. తెల్లారేసిరికి శవమై కనిపించారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన కామాంధులు.. అత్యంత పాశవికంగా హతమార్చారు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దాదాపు నెల రోజుల పాటు దేశంలో వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలిగింది.

ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెప్పి చూసినా ఫలితం దక్కదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి హామీ ఇవ్వడంతో వైద్యులు గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో యువ వైద్యులు మరోసారి రోడ్డెక్కారు. కోల్‌కతా హత్యాచార ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు సమంత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని , ఈ మార్పు త్వరలోనే వస్తుందని ఆకాంక్షిస్తున్నానని సామ్ తెలిపారు.
ఇది జరిగిన కొద్దిరోజులకే మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై కేరళ ప్రభుత్వం నియమించిన జస్టిస్ హేమ కమిటీ సంచలన నివేదికను బయటపెట్టింది. దీనిపై సమంత స్పందించారు. కేరళ తరహాలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమలో మహిళలపై కమిటీలు నియమించాలని కోరారు. 2019లో టాలీవుడ్‌పై నియమించిన సబ్ కమిటీ నివేదికను తక్షణం వెల్లడించాలని ఆమె తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇండియాలో ప్రతి 16 నిమిషాలకు ఓ రేప్ జరుగుతోందని.. ఇది కేవలం ఓ అంకె మాత్రమే కాదని.. ఇది ప్రతిరోజూ ఆడపిల్లల కుటుంబాలు, సమాజం ఎదుర్కొంటున్న సంక్షోభమన్నారు. చట్టాలను కఠినతరం చేయడమే కాదు, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని.. బాధితులకు తక్షణం వైద్య, న్యాయపరమైన సాయంతో పాటు మానసికంగా మద్ధతుగా నిలవాలని సమంత కోరారు. అత్యాచారాలపై సమాజానికి అవగాహన కల్పించాలని.. వేధింపులు ఎదుర్కొంటే భయపడకుండా తక్షణం ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. ప్రతి మహిళకు సురక్షితమైన ప్రదేశాలు అందిస్తామని ఈ పండుగ సీజన్‌లో ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని సమంత పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











