16 సినిమాలు రిజెక్ట్ చేశా.. స్టార్ కమెడియన్‌ను భరించడం కష్టం.. ఆంధ్రావాలా నటి సంచలన వ్యాఖ్యలు
తమిళ, మలయాళ సినీ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకొన్న సోనా హైడెన్ ఉన్నట్టుండి అవకాశాలు తగ్గడంతో దక్షిణాదిలో దాదాపు కనుమరుగైపోయారు. అయితే తాజాగా మలయాళ మీడియాలోని కేరళ కౌముది ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మరోసారి మీడియా అటెన్షన్‌ను సంపాదించుకొన్నారు. తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు. అయితే ఈ ఇంటర్వ్యూలో సీనియర్ కమెడియన్ వడివేలు గురించి ఆమె చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది. సోనా చేసిన విమర్శలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. సోనా ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారంటే?
సోనా హైడెన్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ తలా అజిత్ నటించిన పూవెలమ్ ఉన్ వసంతం సినిమా ద్వారా ఆమె తన నట జీవితాన్ని ఆరంభించారు. ఆ తర్వాత మలయాళంతోపాటు పలు దక్షిణాది భాషల్లో నటించారు. 2000 నుంచి 2015 వరకు బిజీగా ఉంటూ పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో రాజశేఖర్‌తో కలిసి ఆయుధం, రవితేజతో కలిసి వీడే, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆంధ్రావాలా అనే చిత్రంలో నటించింది. అయితే తమిళం, మలయాళం చిత్రాల్లో భారీ ఆఫర్లు రావడంతో తెలుగు పరిశ్రమకు దూరమైంది.

కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే నటి సోనా అనేక వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఇండస్ట్రీ వర్గాలకు మింగుడు పడలేదని చెప్పుకొంటారు. దాంతో ఆమెకు క్రమంగా అవకాశాలు తగ్గడంతో మెయిన్ స్ట్రీమ్‌కు కాస్త దూరమయ్యారు. ప్రస్తుతం స్మోక్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నది. ఆమె ఈ వెబ్ సిరీస్‌కు కథను అందించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. త్వరలోనే ఓటీటీలో రిలీజ్‌కు సిద్దమవుతున్నది.
స్కోక్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ఓ దశలో యాక్టింగ్‌ను వదిలేద్దామని అనిపించింది. ఇండస్ట్రీలో ఎవరినీ నమ్మలేని పరిస్థితి. చాలా మంది వల్ల నేను అనేక సమస్యలను ఎదుర్కొన్నాను. అందుకే వాటిని భరించలేకపోయాను. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యాను అని చెప్పుకొచ్చారు.
అయితే రజనీకాంత్ నటించిన కుసేలన్ అనే సినిమాలో స్టార్ కమెడియన్ వడివేలుతో నటించిన తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ వడివేలు పక్కన నటించమని 16 ఆఫర్లకుపైగా వచ్చాయి. కానీ నేను వాటిని రిజెక్ట్ చేశాను. ఆయనను భరించడం చాలా కష్టం. ఆయనను హ్యాండిల్ చేయలేము. కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పలేను. నాకు ఆత్మగౌరవం ముఖ్యం అంటూ సోనా బాంబు పేల్చింది. అయితే ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











