ఆ సమయంలో నా కెరీర్ క్లోజ్ అనుకున్నా.. ఐశ్వర్య రాజేశ్ ఎమోషనల్..
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అగ్ర నటిగా మారింది. కంటెంట్ ప్రాధాన్యత, వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. గతేడాది విక్టరీ వెంకటేష్- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాతో తన కెరీర్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక తమిళంలో వరుస సినిమాలతో అలరిస్తుంది. తాజాగా 'ఓ సుకుమారి' (Oh Sukumari) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో నటి ఐశ్వర్య రాజేష్ తాజాగా తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది.
ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, ఒక దశలో అవకాశాలు లేక తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడించింది. ముఖ్యంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తన కెరీర్‌లో ఎంతో కీలకమైన మలుపుగా నిలిచిందని చెప్పింది. 'ఆ సినిమా చేసే ముందు దాదాపు ఆరు నెలల పాటు నేను ఇంట్లోనే ఉన్నాను. అవకాశాలు రాక కాదు, కానీ నాకు నచ్చే పాత్రలు, నేను చేయాలని భావించే కథలు రాలేదు. కొన్ని అవకాశాలు వచ్చినా అవి నాకు సెట్ కావని అనిపించింది. అందుకే వాటిని అంగీకరించలేదు. ఒక నటిగా ప్రతి ఒక్కరి జీవితంలో హై పాయింట్స్ ఉంటాయి, అలాగే లో పాయింట్స్ కూడా ఉంటాయి. నా కెరీర్‌లో కూడా అలాంటి పరిస్థితులను చాలాసార్లు ఎదుర్కొన్నాను'అని తెలిపింది.

అంతేకాకుండా, ఆ సమయంలో తన మానసిక పరిస్థితి ఎలా ఉండేదో కూడా వివరించింది. "దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు సరైన సినిమా లేక ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో చాలా ఆందోళన చెందాను. ఇక నాకు మంచి అవకాశాలు రావడం లేదా? నా కెరీర్ ఇక్కడితో ముగిసిపోతుందా? అనే ఆలోచనలు కూడా వచ్చాయి. ఒక నటికి అవకాశాలు లేకపోవడం ఎంత కష్టమో ఆ రోజుల్లో బాగా అనుభవించాను" అంటూ ఎమోషనల్ అయ్యింది.
అలాంటి సమయంలోనే 'సంక్రాంతికి వస్తున్నాం'సినిమాలో అవకాశం వచ్చిందని, ఆ సినిమా తన జీవితాన్ని మళ్లీ మార్చిందని ఐశ్వర్య తెలిపింది. "ఆ సినిమా సెట్స్‌లో మొదటిసారి అడుగు పెట్టిన రోజు ఇప్పటికీ గుర్తుంది. చాలా రోజుల తర్వాత మంచి పాత్ర దక్కిందనే ఆనందం కలిగింది. ఒక హీరోకు ఎలివేషన్ సీన్ వచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో, నేను కూడా ఆ సినిమా సెట్స్‌లో అడుగు పెట్టినప్పుడు అంతే ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యాను" అని చెప్పుకొచ్చింది.
దర్శకుడు అనిల్ రావిపూడిపై కూడా ఆమె ప్రశంసలు కురిపించింది. "అనిల్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఎక్కడైనా, ఏ వేదికపై అయినా నన్ను పరిచయం చేస్తూ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా హిట్ కావడానికి కారణం భాగ్యం. ఆ భాగ్యం ఈమె' అని చెప్పేవారు. ఆయన అలా చెప్పిన ప్రతిసారి నాకు చాలా గర్వంగా అనిపించేది. ఒక దర్శకుడు తన నటీనటులను అంతగా ప్రోత్సహించడం నిజంగా గొప్ప విషయం" అని పేర్కొంది.
ఇక వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఆ సినిమా కథ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఇది చాలా భిన్నమైన టైమ్ జోన్‌లో సాగే కథ. నిజంగా ఆ లైన్ నాకు చాలా నచ్చింది. ఈ సంక్రాంతికి కూడా అనిల్ గారు మరో బ్లాక్‌బస్టర్ అందిస్తారనే నమ్మకం ఉంది" అని తెలిపింది. భవిష్యత్తులో మళ్లీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించాలని ఉందని ఐశ్వర్య తన కోరికను బయటపెట్టింది. "అవకాశం వస్తే ఆయనతో మరోసారి పని చేయాలని ఉంది. దేవుడి దయతో ఆ అవకాశం వస్తే చాలా సంతోషంగా ఉంటుంది" అంటూ తన మనసులోని అభిలాషను వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. యంగ్ హీరో తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రూరల్ రొమాంటిక్ కామెడీ మూవీ 'ఓ.. సుకుమారి'. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యాదగిరి అనే అల్లరి యువకుడిగా తిరువీర్ కనిపించగా, దామిని పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిన యాదగిరి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. టీజర్‌లో రొమాన్స్, కామెడీ, గ్రామీణ వాతావరణం ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications





