నా కోడళ్ల వల్ల జీవితం మారిపోయింది.. శోభిత, జైనబ్‌లపై అమల కామెంట్స్
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు అమల అక్కినేని (Amala Akkineni). 1980- 90 దశకాల్లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన అమలకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఉంది.ఆమె నటి మాత్రమే కాదు, శాంత స్వభావి, క్లాసికల్ డాన్స్ పట్ల అభిరుచి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కినేని ఇంటి ఆదర్శ కోడలు అనే పేరుతో కూడా ఆమె గుర్తింపు పొందారు. తాజాగా ఇంటర్వ్యూలో అమల తన కోడళ్లైన శోభిత ధూళిపాల (నాగ చైతన్య భార్య), జైనబ్ (అఖిల్ భార్య) గురించి మాట్లాడారు. వారి వ్యక్తిత్వం, కుటుంబంలో కలిసిపోవడం గురించి అమల చెప్పిన మాటలు అభిమానుల్లో మంచి ఆసక్తి రేపాయి.
టాలీవుడ్ సీనియర్ నటి అమల అక్కినేని ఇటీవలి కాలంలో సినిమాల కంటే కుటుంబ జీవనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఒకే ఒక జీవితం' చిత్రంలో చివరిసారిగా నటించిన తర్వాత కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక కార్యక్రమాలు మరియు పబ్లిక్ ఈవెంట్లలో మాత్రం చురుకుగా కనిపిస్తున్నారు. ఇక 36 ఏళ్ల తర్వాత నాగార్జున-అమల జంట కాంబినేషన్‌లో వచ్చిన శివ చిత్రం రీ-రిలీజ్ కావడంతో అమల మళ్లీ మీడియా దృష్టిలో నిలిచారు. సాధారణంగా వ్యక్తిగత విషయాలను బయట పెట్టని ఆమె, ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి ఆసక్తికరంగా పంచుకున్నారు.

టాలీవుడ్ సీనియర్ నటి అమల అక్కినేని తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబం, ముఖ్యంగా కోడళ్లు శోభిత ధూళిపాల, జైనబ్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "అత్తమ్మ కావడం నాకు అద్భుతమైన అనుభవం. నా కోడళ్లు ఇద్దరూ లవ్లీ, మంచి మనసున్నవారు. శోభిత చాలా టాలెంటెడ్, సున్నితమైన వ్యక్తిత్వం కలది. నామీద ఎంతో ప్రేమతో ఉంటుంది. ఆమెతో సమయం గడపడం నా కోసం ఒక ఆనందం" అని అమల చెప్పారు.
ఇక చిన్న కోడలు జైనబ్ గురించి మాట్లాడుతూ, "జైనబ్ కూడా చాలా మంచి వ్యక్తి. తన రంగంలో ఎప్పుడూ పోటీపడి, ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తుంది. మా ఇంట్లో కోడళ్లు ఉంటే నవ్వులు, అల్లరి, పాజిటివిటీతో నిండిపోతుంది. వారిని కోడళ్లుగా కాదు... కూతుర్లుగానే భావిస్తాను. ఈ బంధం నా జీవితంలో ఒక ముఖ్యమైన బాధ్యత" అని చెప్పారు. జైనబ్ ముస్లిం కుటుంబానికి చెందినా, వారి ఇంట్లో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పూర్తిగా కలిసిపోయి పాల్గొంటుందని, యూనిటి ఇన్ డైవర్సిటీ (Unity in Diversity) చూడాలంటే మా ఫ్యామిలీని చూడాలి" అని సరదాగా అన్నారు.
అమల తనకున్న భిన్న మత నేపథ్యాన్ని కూడా వివరించారు. "మా అమ్మ క్యాథలిక్ క్రిస్టియన్, కానీ తర్వాత సోఫిజాన్ని ఆచరించారు. నా నాన్న హిందూ. మామయ్య (నాగేశ్వరరావు అక్కినేని) గారికి మతం పట్ల ప్రత్యేక విశ్వాసాలు ఉండేవి కాదేమో కానీ, ఆయన పనినే దేవతగా భావించేవారు. గుడికి వెళ్లి వచ్చాక చెడు పనులు చేస్తే దాని అర్థమేంటి? నిజాయితీతో, నిబద్ధతతో చేసే పని దేవత అని ఆయన నమ్మకం" అని అమల గుర్తుచేసుకున్నారు.
ఇక తన ఆధ్యాత్మికత గురించి చెబుతూ, "నేను బౌద్ధాన్ని ఫాలో అవుతాను. ధ్యానం, ప్రశాంతత, ఆత్మ పరిశీలన ఇవి నా జీవితాన్ని మార్చేశాయి" అని అమల చెప్పారు. "మా ఇంట్లో ఒకరు హిందూ, ఒకరు ముస్లిం, నేను బౌద్ధం... మా అమ్మ క్రిస్టియన్. ఇలా అన్ని మతాలు మా కుటుంబంలో ఉన్నాయి. కానీ ప్రేమ, గౌరవం మాత్రం అందరిలో ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వం అంటే మా ఇంటికే ఉదాహరణ" అంటూ అమల పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











