బొంబాయి వాళ్లకే ఆఫర్లు.. పవన్ కళ్యాణ్‌తో చేసినా అవకాశాలు రాలే..
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla)గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రియదర్శితో కలిసి నటించిన మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనన్య, తొలి సినిమాతోనే సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మరింత పాపులారిటీ సంపాదించింది. అయితే ఆ సినిమా తర్వాత స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు వస్తాయని భావించినా, ఆమె కెరీర్ మాత్రం అనుకున్న దారిలో వెంటనే సాగలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనన్య స్వయంగా వెల్లడించింది.
సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య తన సినీ ప్రయాణం, టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల పరిస్థితి గురించి ఓపెన్‌గా మాట్లాడింది. ఈ సందర్భంగా యాంకర్ రోషన్ 'మీరు ఖమ్మం నుంచి వచ్చారని కాకుండా బాంబే నుంచి వచ్చానని చెప్పుంటే మరిన్ని అవకాశాలు వచ్చేవి కదా?'అని ప్రశ్నించగా, అనన్య ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'బొంబాయి నుంచి వచ్చిన వాళ్లకు కచ్చితంగా అవకాశాలు త్వరగా వస్తాయి. కానీ లాంగ్ లాస్టింగ్ కెరీర్ కావాలంటే మాత్రం తెలుగు అమ్మాయిలే కరెక్ట్. వాళ్లకే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండే అవకాశాలు ఉంటాయి' అంటూ ఆమె స్పష్టంగా చెప్పింది.

గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయని కూడా అనన్య అభిప్రాయపడింది. 'గత నాలుగు-ఐదు సంవత్సరాలుగా తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో అవకాశాలు మెరుగయ్యాయి. హీరోయిన్లుగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా వస్తున్నాయి. పెద్ద కమర్షియల్ హీరోయిన్ల రోల్స్ తక్కువగా వచ్చినా, కెరీర్ లైఫ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది' అంటూ తన పాయింట్ ఆఫ్ వ్యూ వివరించింది. హీరోయిన్గా క్యారెక్టర్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడానికే తాను ఎక్కువగా ఆసక్తి చూపుతానని, అలాంటి పాత్రలే తనకు వస్తున్నాయని చెప్పింది.
ఇక వకీల్ సాబ్ తర్వాత తన కెరీర్ ఒక్కసారిగా మారిపోతుందని భావించానని అనన్య అంగీకరించింది. 'పవన్ కళ్యాణ్ లాంటి గ్రేట్ యాక్టర్‌తో నటించాను కాబట్టి, నా పర్ఫార్మెన్స్ చూసి వెంటనే మంచి పాత్రలు వస్తాయని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. కొంత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు రావడం మొదలయ్యాయి' అంటూ తన అమాయకత్వాన్ని గుర్తుచేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లు అయ్యాయని, అందులో రెండు సంవత్సరాలు కరోనా వల్ల కోల్పోయానని, మిగిలిన మూడు సంవత్సరాల్లో మూడు సినిమాలు చేశానని తెలిపింది. ప్రస్తుతం ఈ ఏడాది దాదాపు ఏడు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది.
అలాగే తన ఇమేజ్ గురించి కూడా అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మల్లేశం, వకీల్ సాబ్ లాంటి సినిమాల తర్వాత తనను చాలామంది 'రెడిషనల్ గర్ల్'గా ముద్ర వేశారని చెప్పింది.'యాక్టర్ అంటే కేవలం ట్రెడిషనల్ పాత్రలే కాదు, గ్లామర్ కూడా చూపించాలి. అందుకే ఫోటోషూట్స్ చేశాను. అలాంటి పాత్రలు చేయడానికి కూడా నేను సిద్ధమే' అంటూ తన ఇమేజ్ బ్రేక్ చేయడానికి చేసిన ప్రయత్నాల్ని వివరించింది. ప్రస్తుతం అనన్య నాగళ్ల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల అవకాశాలపై మరోసారి చర్చకు తెరతీశాయి.


Click it and Unblock the Notifications











