Anasuya Bharadwaj: నేను భరించలేకపోయా.. అనసూయ కన్నీళ్లు..
సినీ నటుడు శివాజీ(Shivaji) మహిళల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మరోసారి బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) తీవ్రంగా స్పందించారు. మహిళల స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారానికి మద్దతుగా బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఈ క్రమంలో అనసూయకు మద్దతు లభించినప్పటికీ, మరోవైపు కొందరి నుంచి తీవ్రమైన ట్రోలింగ్, వ్యక్తిగత దూషణలు ఎదురయ్యాయి.
ముఖ్యంగా ఆమెను, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఈ వివాదంపై ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌కు అనసూయ వీడియో కాల్ (జూమ్) ద్వారా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వెల్లువెత్తగా, తాజాగా అనసూయ స్వయంగా స్పందిస్తూ తన భావోద్వేగానికి గల అసలు కారణాన్ని వెల్లడించారు.

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్‌లో అనసూయ మాట్లాడుతూ, 'నిన్న జూమ్ కాల్ ద్వారా ప్రెస్‌మీట్‌లో మాట్లాడాను. ఆ సమయంలో నాకు లభించిన మద్దతు నన్నెంతో భావోద్వేగానికి గురి చేసింది. అదే సమయంలో కొంతకాలంగా నేను శారీరకంగా అనారోగ్యంతో ఉండటంతో, ఆ బలహీన క్షణంలో నా కన్నీళ్లు ఆగలేదు. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను పూర్తిగా బాగున్నాను'అని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై అనవసర ఆందోళనలు అవసరం లేదని కూడా ఆమె స్పష్టం చేశారు.
మహిళల స్వయంనిర్ణయాధికారానికి మద్దతుగా మాట్లాడినందుకు తాను మాత్రమే కాదు, ఏ మహిళైనా ఇలాంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అదే సమయంలో తన వెనుక నిలబడి అండగా ఉన్న మహిళల వల్ల తనకు అపారమైన ధైర్యం లభిస్తోందని తెలిపారు. "మనమంతా మనుషులమే. మనిషిగా భావోద్వేగానికి లోనవ్వడంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు" అని ఆమె స్పష్టంగా చెప్పారు.
ఇంకా ముందుకెళ్లిన అనసూయ, తాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా బూడిద నుంచి మళ్లీ లేచి నిలబడతానని ధీమా వ్యక్తం చేశారు. 'ఎవరి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాభపడాలని చూస్తారో, అది వారి స్వభావాన్ని మాత్రమే చూపిస్తుంది.. నన్ను కాదు' అంటూ ఘాటైన వ్యాఖ్య చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని వర్గాలపై తన నమ్మకం తగ్గుతున్నా, దేశ న్యాయవ్యవస్థపై మాత్రం పూర్తి విశ్వాసం ఉందని ఆమె వెల్లడించారు. క్లిక్‌బైట్ కథనాలు, ఊహాగానాలకు దూరంగా ఉండాలని మీడియా, ప్రజలను కోరారు.
ఈ వివాదంలో అనసూయకు నటి, సింగర్ చిన్మయి శ్రీపాద సహా పలువురు మహిళా సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో తాను ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినా, ధైర్యంగా, ఐక్యతతో తన తరపున మాట్లాడిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అనసూయ భావోద్వేగ పోస్ట్‌తో ముగించారు. "నేను ఏదైనా చెప్పాలనుకుంటే, అది నేరుగా నా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే ఉంటుంది. అంతవరకు మౌనంగానే ఉంటాను. మనమంతా శాంతి, సానుభూతి, మానవత్వాన్ని ఎంచుకుందాం' అంటూ ఆమె పిలుపునిచ్చారు.
ఇలా శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం మహిళల స్వేచ్ఛ, భావోద్వేగాలు, వ్యక్తిగత హద్దులపై మరోసారి సమాజంలో చర్చను రేకెత్తించింది. ట్రోలింగ్, విమర్శల మధ్య కూడా వెనక్కి తగ్గకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది అనసూయ. ఇక చూడాలి ఈ వివాదం ఎటు వైపుకు దారి తీస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications










