Master Chef లోకి అనసూయ భరద్వాజ్.. లీగల్ నోటీసులు పంపిన తమన్నా
సినీ పరిశ్రమలో మిల్కీ బ్యూటీగా తన నటన, గ్లామర్‌తో ఆకట్టుకొంటున్న తమన్నా భాటియా సినిమాలు, వెబ్ సిరీస్‌తో జోష్‌ను కొనసాగిస్తున్నారు. ఇటీవల మ్యాస్ట్రో, సీటీమార్ లాంటి చిత్రాలతో విజయాలను సొంతం చేసుకొన్నారు. అయితే టెలివిజన్‌లో రియాలిటీ షోలతో ప్రేక్షకుల్లోకి వచ్చారు. తాజాగా ఆమె హోస్ట్‌గా ప్రారంభించిన మాస్టర్ ఛెఫ్ షో నుంచి తప్పుకోవడం తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాం విషయంలో తమన్నా కోర్టును ఆశ్రయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

మాస్టర్ చెఫ్ హోస్ట్‌గా బుల్లితెరపై
తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. అయితే కంటెంట్ సరిగా లేకపోవడంతో రేటింగ్ దారుణంగా పడిపోయింది.

మాస్టర్ చెఫ్ రేటింగ్స్
మాస్టర్ చెఫ్ షో రేటింగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది 37వ వారంలో అర్బన్‌లో 3.65 రేటింగ్, 38వ వారంలో 2.23, 39వ వారంలో 1.81 రేటింగ్, 40వ వారంలో 1.29, 41వ వారంలో 1.36 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 37వ వారంలో 2.21, 38వ వారంలో 1.49, 39 వారంలో 1.38, 40వ వారంలో 1.12, 41వ వారంలో 1.11 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నారు. అయితే ఈ షోకు ఊహించినంతగా, ఆశించినంతగా రేటింగ్ లేకపోవడంతో తమన్నాను ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ తప్పించినట్టు సమాచారం.

తమన్నాను తప్పించి అనసూయను
అయితే మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం నుంచి తమన్నా భాటియాను తప్పించి.. టాప్ యాంకర్ అనసూయను తెరపైకి తీసుకొచ్చారు. అయితే అనసూయ రంగ ప్రవేశంతో ఈ షో మంచి రేటింగ్ సాధిస్తుందనే ఆశాభావంతో ప్రొడక్షన్ హౌస్ ఉన్నట్టు సమాచారం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రొడక్షన్ హౌస్‌కు తమన్నా షాకిచ్చింది.

మాస్టర్ చెఫ్ నిర్వాహకులకు నోటీసులు
ఆంగ్ల జాతీయ దిన పత్రిక కథనం ప్రకారం.. తనను తొలగించడంపై తమన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసుల్లో పేర్కొన్నారు అని వెల్లడించింది.

తమన్నా లాయర్ ఏం చెప్పారంటే..
మాస్టర్ చెఫ్ కార్యక్రమం కోసం తమన్నా పలు ప్రాజెక్టులు వదులుకొన్నారు. ఈ షోకు సంబంధించిన తొలి సీజన్‌ను పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన పనులను ఆమె క్యాన్సిల్ చేసుకొన్నారు అని తమన్నా భాటియా లాయర్ వెల్లడించినట్టు సమాచారం. తన క్లయింట్‌తో అన్ ప్రొఫెషనల్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా తన క్లయింట్ తమన్నాతో ప్రొడక్షన్ హౌస్ కమ్యునికేషన్ ఆపివేశారు అని ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై ఆరోపణలు సంధించారు.

తమన్నా, అనసూయ కెరీర్ ఇలా..
ఇక తమన్నా కెరీర్ విషయానికి వస్తే.. హిందీలో ప్లాన్ ఏ ప్లాన్ బీ చిత్రంలో భోలే చుడియా, తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం, దట్ ఈజ్ మహాలక్ష్మి చిత్రాల్లో నటిస్తున్నారు. అనసూయ విషయానికి వస్తే.. పుష్ఫ, ఆచార్య, ఖిలాడి, భీష్మ పర్వం, రంగ మార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











